లక్షలాది మంది శివభక్తులు, పర్యాటకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అమర్‌నాథ్ యాత్రకు ఎట్టకేలకు జమ్మూకాశ్మీర్ అధికార యంత్రాంగం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. రెండేళ్ల తర్వాత మళ్లీ అమర్‌నాథుడిని దర్శించే అవకాశం కల్పిస్తూ అమర్‌నాథ్ దేవస్థానం మండలి ఆదివారం నిర్ణయించింది. 2019లో జమ్మూకాశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే 370 అధికరణం రద్దు చేసిన నేపథ్యంలో అమర్‌నాథ్ యాత్రను నిలిపివేశారు. ఆ తర్వాత కోవిడ్ మహమ్మారి విజృంభించడంతో యాత్ర ఊసు ఎత్తలేదు. సంప్రదాయం ప్రకారం నామమాత్రం పూజాదులు నిర్వహించడంతో సరిపెట్టారు. ప్రస్తుతం అటు కాశ్మీర్‌లో పరిస్థితులు కుదుటపడటం, మహమ్మారి ప్రభావం తగ్గిపోవడంతో ఇప్పుడు అమర్‌నాథ్ యాత్రకు అనుమతి ఇవ్వాలని నిర్ణయించారు. యాత్ర ప్రారంభ తేదీని నిర్ణయించేందుకు అమర్‌నాథ ఆలయ మండలి భేటీ అయ్యిందని, జూన్ 30 నుంచి 43 రోజుల పాటు దర్శనాలకు అనుమతించాలని నిర్ణయించిందని లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ట్విట్టర్‌లో పేర్కొన్నారు.
సంప్రదాయం ప్రకారం రక్షాబంధన్ రోజునుంచి ఈ యాత్ర ప్రారంభమవుతుందని, భద్రతా ఏర్పాట్లు సహా అనేక అంశాలను ఈ సమావేశంలో చర్చించామని వెల్లడించారు. అమర్‌నాథ్ యాత్రకు సంబంధించిన వ్యవహారాలను పర్యవేక్షించేందుకు 200 0 సంవత్సరంలో శ్రీ అమర్‌నాథ్ దేవస్థానం మండలిని అప్పటి జమ్మూకాశ్మీర్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ బోర్డుకు గవర్నర్ ఎక్స్ అఫీషియో సభ్యునిగా వ్యవహించేవారు. కాగా 370 రద్దు, జమ్మూకాశ్మీర్, లఢక్ కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించిన నేపథ్యంలో లెఫ్టినెంట్ గవర్నర్ ఎక్స్ అఫీషియో సభ్యునిగా వ్యవహరిస్తున్నారు. అతి ఎత్తయిన, సంక్లిష్టమైన వాతావరణంకూడిన హిమాలయ శిఖరాల్లోని గుహలో మంచు శివలింగాన్ని అమరనాథుడిగా భక్తులు కొలుస్తారు. లక్షలాదిమంది ఆ మంచు శివలింగ దర్శనంకోసం పరితపిస్తారు. ఇక ట్రెక్కింగ్ ప్రియులు కూడా అమర్‌నాథ్ యాత్రపై ఆసక్తి చూపుతారు. రెండేళ్లుగా ఆ ఆవకాశాలు లేకపోవడంతో ఈసారి పెద్దసంఖ్యలో భక్తులు సందర్శించే వీలుంది.