Monday, November 25, 2024

‘అమరావతి ఉద్యమ భేరి’.. 500వ రోజుకు రాజధాని ఉద్యమం

మూడు రాజధానుల నిర్ణయానికి వ్యతిరేకంగా ఒకే రాష్ట్రం ఒకే రాజధాని నినాదంతో ప్రారంభమైన అమరావతి ఉద్యమం 500 రోజులకు చేరుకుంది. అమరావతి రాజధానిని ఏకైక రాజధానిగా ప్రకటించే వరకు తమ ఉద్యమం ఆగదని అమరావతి రాజధాని ఐకాస ప్రకటించింది. ‘అమరావతి ఉద్యమ భేరి’ పేరుతో వర్చువల్‌ విధానంలో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకూ సభ నిర్వహిస్తున్నారు. లక్షమంది పాల్గొనేలా ఏర్పాట్లు చేశారు. కరోనా నిబంధనలు పాటిస్తూ ఈ సభను నిర్వహిస్తున్నట్లు ఐకాస ప్రతినిధులు తెలిపారు. వర్చువల్ సభలో రైతులను ఉద్దేశించి టీడీపీ అధినేత చంద్రబాబు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, సీపీఐ నేత రామకృష్ణ, ఏపీసీసీ అధ్యక్షడు శైలజానాథ్, తులసిరెడ్డి తదితరులు మాట్లాడనున్నారు.

రాజధాని ప్రాంతాల్లోని దీక్షా శిబిరాల నుంచి భౌతిక దూరం పాటిస్తూ రైతులు సభలో పాల్గొనేలా శిబిరాల్లో ఎల్‌ఈడీ తెరలు ఏర్పాటు చేయనున్నారు. మరికొందరు ఇళ్లలోనే సెల్‌ ఫోన్‌, కంప్యూటర్‌ నుంచి అనుసంధానమై పాల్గొనేలా అవగాహన కల్పించారు. రైతుల ఉద్యమానికి వైసీపీ మినహా అన్ని రాజకీయ పార్టీల మద్దతు తెలిపాయి. ఏడాదిన్నరగా మహిళలు ఉద్యమాన్ని ముందుండి నడిపిస్తున్నారు. 2019 డిసెంబర్ 17న అసెంబ్లీలో 3 రాజధానులపై సీఎం జగన్ ప్రకటన చేశారు. 2019 డిసెంబర్ 18 నుంచి రాజధాని గ్రామాల్లో ఉద్యమం మొదలైంది. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా రాజధాని గ్రామాల్లో రైతులు హైకోర్టు ఆశ్రయించారు. రాజధాని కోసం న్యాయపోరాటం చేస్తున్నారు. 500వ రోజుకు చేరుకున్న సందర్భంగా ప్రధానికి ఐకాస నేతల లేఖలు రాశారు.

రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఆరు నెలలకే మూడు రాజధానుల ప్రకటన చేయడంతో అమరావతి రాజధాని పరిధిలోని 29 గ్రామాల రైతులు ఉద్యమం ప్రారంభించారు. ఉద్యమం 13 జిల్లాలకు విస్తరించిన సమయంలోనే కరోనా వైరస్ దేశంలోకి ప్రవేశించడంతో ఉద్యమాన్ని అమరావతి రాజధాని గ్రామాలకు పరిమితం చేశారు. అప్పటి నుంచి అలుపెరగకుండా 29 గ్రామాల అమరావతి రాజధాని రైతులు నిత్యం ఉద్యమం కొనసాగిస్తూనే ఉన్నారు. అమరావతిని ఏకైక రాజధానిగా ప్రకటించాలని రైతులు చేస్తున్న ఉద్యమం నేటికి సరిగ్గా 500 రోజులకు చేరింది. ఈ ఉద్యమం ఇంతటితో ఆగదని, అమరావతిని ఏకైక రాజధానిగా ప్రకటించే వరకు ఉద్యమం కొనసాగుతుందని రైతులు, ఐకాస నేతలు తేల్చి చెప్పారు. ఈ ఉద్యమంలో ఎందరో రైతులు ప్రాణాలు కోల్పోయారని, వేలాది మంది రైతులు పంటలు లేక మనోవేదనకు గురికావాల్సి వస్తోందని ఐకాస నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. రైతుల పరిస్థితిని గమనించి ఇప్పటికైనా అమరావతిని ఏకైక రాజధానిగా ప్రకటించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

అమరావతిపై జగన్ సర్కార్ వ్యవహరిస్తున్న తీరుపై ప్రతిపక్ష టీడీపీ విమర్శలు చేస్తూనే ఉంది.  29 గ్రామాల రైతులు ఒక్క రూపాయి తీసుకోకుండా 33 వేల ఎకరాల భూమిని రాజధానికి ఇచ్చారని చంద్రబాబు గుర్తుచేశారు. రైతుల త్యాగాలు ఊరికే పోవని, అమరావతి రాజధాని కొనసాగించి ఉంటే ఇప్పటికే ఏపీకి 5 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చి ఉండేవని ఆయన అభిప్రాయపడ్డారు. నేడు ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఒక్కరు కూడా ముందుకు వచ్చే పరిస్థితి లేదని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.  

Advertisement

తాజా వార్తలు

Advertisement