అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ చేపట్టిన దరఖాస్తుల ప్రక్రియ ఇవ్వాల్టి (శుక్రవారం)తో ముగిసింది. రాష్ట్రంలోని 119 నియోజకవర్గాలకు గాను 900 దరఖాస్తులు వచ్చినట్టు తెలుస్తోంది. ఇందులో ఖమ్మం జిల్లా ఇల్లందు నుంచి 38 మంది దరఖాస్తు చేసుకున్నారు. గాంధీభవన్‌లో 8 రోజులుగా ఈ ప్రక్రియ కొనసాగుతోంది.
టికెట్ల కోసం దరఖాస్తు చేసుకున్నవారిలో సకుటుంబ సపరివార సమేతంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇందులో వారసులు, కుటుంబ సభ్యుల హవా ఎక్కువగా ఉన్నట్టు సమాచారం. కీలకమైన స్థానాల్లో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు దరఖాస్తు చేసుకున్నట్టు సమాచారం. నల్గొండ జిల్లా హుజూర్నగర్ టికెట్ కోసం సీనియర్ నేత ఉత్తమ్ కుమార్‌రెడ్డి, కోదాడ నుంచి ఆయన సతీమణి పద్మావతి, మిర్యాలగూడ, నాగార్జునసాగర్ కోసం సీనియర్ నేత, మాజీ మంత్రి జానారెడ్డి, ఆయన కుమారులు రఘువీర్, జయవీర్ కూడా దరఖాస్తు చేసుకున్నారు.
ఇక.. హైదరాబాద్‌లోని ముషీరాబాద్ టికెట్ కోసం అంజన్‌కుమార్ యాదవ్, ఆయన కుమారుడు అనిల్ కుమార్ యాదవ్, కరీంనగర్ సీటు కోసం రమ్యారావు, ఆమె కుమారుడు రితేష్ రావు, ములుగు నియోజకవర్గానికి ధనసరి అనసూయ (సీతక్క), ఖమ్మం జిల్లాలోని పినపాక కోసం సీతక్క కుమారుడు సూర్యం, సంగారెడ్డి జిల్లాలోని అందోల్ కోసం దామోదర రాజనర్సింహాతోపాటు ఆయన కూతురు త్రిష దరఖాస్తు చేసుకున్నట్టు సమాచారం అందుతోంది.