హైదరాబాద్, ఆంధ్రప్రభ: తెలంగాణలో తెదేపా అను కూల ఆంధ్ర సెటిలర్ల పరిస్థితి విచిత్రంగా మారింది. ఇటీ వల జరిగిన పరిణామాలు వారిని గందరగోళంలో పడే శాయి. తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఢిల్లి వెళ్లి కేంద్ర హోమ్ మంత్రి అమిత్‌షా, భాజపా జాతీయ అధ్యక్షుడు నడ్డాతో భేటీ కావడమే ఇందుకు కారణం. దీంతో మళ్లి భాజపాతో చంద్రబాబు చేతులు కలుపుతున్నా రని వార్తలు వెలువడుతున్నాయి. కర్నాటకలో కాంగ్రెస్ విజయం సాధించడంతో దేశవ్యాప్తంగా ముఖ్యంగా తెలం గాణలో ఆ పార్టీ విజయోత్సాహంతో ఉరకలు వేస్తోంది. అప్పటివరకూ తెలంగాణలో కాంగ్రెస్ కంటే భాజపా కాస్తంత బలంగా ఉందన్న అభిప్రాయం అన్నివర్గాల్లో ఉంది. కాని, కర్నాటక ఫలితంతో అది తారుమారైంది. పైగా భాజపాలో చేరికలు లేకపోవడం, గ్రూపుల వ్యవ హారం అంతకంతకూ రచ్చకెక్కడంతో ఈ అభిప్రాయం మరింత బలపడింది. దీనికితోడు కాంగ్రెస్‌లో ఐక్యతా రాగం, రేవంత్ దూకుడు, మరోపక్క భట్టి విక్రమార్క పాదయాత్ర శ్రేణుల్లో జోష్ నింపాయి. ఈ నేపథ్యంలో అకస్మాత్తుగా చంద్రబాబు నాయుడు హస్తిన వెళ్లి భాజపా పెద్దలను కలవడం ఒక్కసారిగా చర్చనీయాంశంగా మారింది. భాజపా అధినాయకత్వం పిలిచిందా, తెదేపా అధినేతే చొరవ తీసుకున్నారా అన్నది పక్కనబెడితే, అమిత్‌షా, నడ్డాలతో భేటీ కచ్చితంగా తెలుగు రాష్ట్రాల్లో పొత్తు గురించేనన్నది నిర్వివాదాంశం. అయితే, ఈ పరిణామం ఎవరికి ఎంత లాభం లేదా నష్టం అన్న దానిపై రాజకీయ వర్గాలతో పాటు ఇటు తెలంగాణ సెటిలర్లలో పెద్దఎత్తున చర్చలు, విశ్లేషణలు సాగుతున్నాయి.
కర్నాటక ఎన్నికల ఫలితాలు వెలువడక ముందు వరకూ ఏపీలో భాజపా, జనసేన, తెదేపాలు కలిసి ముందుకు వెళితే అక్కడ అధికార పక్షం వైకాపాకు గడ్డు పరిస్థితి తప్పదన్న అభిప్రాయం అటు జనంలోను, ఇటు రాజకీయ పరిశీలకుల్లోనూ ఉండేది. అయితే, వైకాపాకు పరోక్షంగా సహకరిస్తున్న భాజపాను వదిలి జనసేన బయటకు వచ్చి తెదేపాతో కలిసి ముందుకు సాగితే మరింత మెరుగ్గా ఫలితాలు ఉంటాయన్న అభిప్రాయాలు కూడా వెలువడ్డాయి. కాంగ్రెస్‌తో పాటు భాజపా కూడా రాష్ట్ర విభజనకు కారణమన్న గాయం ఇంకా ఏపీ ప్రజల్లో మాసిపోలేదు. పైగా, విభజన సమయంలో భాజపా ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ ఆ తర్వాత అధికారంలోకి వచ్చి కూడా భాజపా నెరవేర్చలేదన్న నిస్పృహ ఏపీ ప్రజల్లో బలంగా ఉంది.
ఈ నేపథ్యంలో తెలంగాణలో బలపడేందుకు భాజపా తిరిగి చంద్రబాబుతో ఎందుకు కలిసి వెళ్లాలనుకుంటోంది? ఎలాగూ వైకాపా తనకు పరోక్షంగా అనుకూలంగానే ఉంది కనుక తెదేపాతో ప్రత్యక్షంగా జట్టు కడితే ఎంతో కొంత సెటిలర్ల ఓటు శాతం తనకు అనుకూలంగా ఉంటుందన్నది భాజపా పెద్దల ఆలోచనగా అంచనాలు వెలువడుతున్నాయి. ఇందుకు అనుగుణంగానే చంద్రబాబుతో చర్చలు సాగాయని భావిస్తున్నారు. అయితే, ఇక్కడే సెటిలర్లు తీవ్ర ఆలోచనల్లో పడ్డారు. ఏపీలో వ్యతిరేకిస్తూ ఇక్కడ మద్దతు ఏవిధంగా ఇవ్వాలన్న ప్రశ్న వారిని తొలిచేస్తోంది. పైగా జగన్‌కు పరోక్షంగా మద్దతు ఇస్తున్న పార్టీకి ఏవిధంగా వత్తాసు పలకాలన్నది తెదేపా అనుకూల సెటిలర్ల భావన.
తెదేపా అనుకూల సెటిలర్లలో ఎక్కువమంది కాంగ్రెస్‌కు, రేవంత్‌కు మద్దతు పలుకుతున్నారన్నది స్పష్టం. గత ఎన్నికల్లో మల్కాజ్‌గిరి లోక్‌సభ స్థానం పరిధిలో అన్ని అసెంబ్లి స్థానాలను కాంగ్రెస్ ఓడిపోయినా ఎంపీగా రేవంత్ గెలవడమే ఇందుకు నిదర్శనం. తాజాగా చంద్రబాబు భాజపా పెద్దలతో భేటీ కావడంతో తెదేపా అనుకూల సెటిలర్లలో తీవ్ర నిరాశ, నిస్పృహలు వ్యక్తమవుతున్నాయి. తమ అధినేత చంద్రబాబు నాయుడు మళ్లి భాజపా ట్రాప్‌లో పడిపోయారని వారు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు. ఒకవేళ భాజపాతో చేతులు కలిపినా ఓట్ల బదలాయింపు అంత తేలిగ్గా జరగదని విశ్లేషకులు కూడా స్పష్టం చేస్తున్నారు. ఇది చివరకు అటు ఏపీలోనూ ఇటు తెలంగాణలోనూ రెంటికీ చెడిన రేవడిలా చంద్రబాబు తయారవుతారని భావిస్తున్నారు.