ప్రభన్యూస్ : సరిగ్గా 20 రోజులు ముందు నెల్లూరు మార్కెట్‌లో రూ.100లకు 5 కిలోల టమోటాలు విక్రయించారు. వంకాయలు కిలో 20 , బెండకాయలు రూ. 15, క్యాబేజీ రూ.25 , క్యాలిఫ్లవర్ రూ.30 ఇలా అన్నీ రకాల కూరగాయల ధరలు సామాన్యుడికి అందుబాటులో ఉన్నాయి . నిరంతరం వర్షాలు కురుస్తుండడం , అనుకోకుండా పెన్నా నదికి వరద రావడంతో జిల్లాలోని పలు ప్రాంతాలు పూర్తిగా నీట మునిగి ధ్వంసమయ్యాయి . ముఖ్యంగా కూరగాయల తోటల్లో కూడా నీరు నిలబడిపోయి కుళ్లిపోవడంతో పంట నష్టపోవడం జరిగింది.
మార్కెట్‌కు ప్రధాన ఎగుమతుదారులైన చెన్నై , కర్నాటకలోని పలు ప్రాంతాల్లో కూడా వరదల కారణంగా, భారీ వర్షాల కారణంగా కూరగాయాల దిగుబడి తగ్గింది. దీంతో ఆయా మార్కెట్‌లకు వచ్చే కూరగాయల క్వాంటిటీ కూడా తగ్గడంతో వారు తమ అవసరాలు పోనూ తక్కువ మొత్తంలోనే నెల్లూరుకు పంపగలగతున్నారు.ఇటు సాంప్రదాయంగా జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి వచ్చే కూరగాయలు తగ్గడం, దిగుమతులు తగ్గడంతో కూరగాయల ధరలు అమాంతంగా ఆకాశాన్ని అంటాయి. ముఖ్యంగా ప్రతి కూరలోనూ వాడే టమోటో రూ. 150లకు చేరుకుని సామాన్యుడికి చుక్కలు చూపిస్తోంది. ఇదే టమోటో ధర గిట్టుబాటు కాక రైతులు రోడ్లపై పోసిన సందర్భాలు రాష్ట్రంలో ఎన్నో పర్యాయాలు చోటుచేసుకున్నాయి. ప్రస్తుతం పరిస్థితి చూస్తే అందుకు పూర్తి విరుద్ధంగా ఉంటోంది. ప్రభుత్వం ఈ విషయపై ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాల్సిన అవసరం ఉంది.
కూరగాయల ధరలు పెరిగాయి కదా .. పప్పు ధాన్యాలతో సరిపెట్టుకుందా మంటే రాకపోకల్లో అంతరాయం కారణంగా దిగుమతి తగ్గి వాటి ధరలు కూడా గూబ గుయ్యమనేలా ఉండడంతో సామాన్యుడి జనజీవనం దుర్భరంగా మారింది. సమస్యను ముందుగానే గుర్తించి పరిష్కరించాల్సిన మార్కెటింగ్ శాఖ అధికారులు జిల్లాలో ఉత్సవ విగ్రహాలుగా మారిపోవడంతోనే కూరగాయల వ్యాపారులు కూడా ఇష్టమొచ్చినట్లు రేట్లు పెంచుతున్నారన్న విమర్శలు కూడా ఉన్నాయి .
జిల్లాలోని అన్నీ ప్రాంతాల్లో అధికంగా వరిపైరును సాగు చేస్తారు. చాలా ప్రాంతాల్లో వరి పంట సాగయ్యే పొలం లాభదాయకంగా ఉండే కూరగాయల సాగుకు ఉపయోగపడినప్పటికీ ఉద్యాన శాఖ అధికారుల ప్రోత్సాహం లేకపోవడం , రైతుల్లో కూడా రిస్కు ఎందుకులే అన్న భావన ఉండడంతో పంట మార్పిడి వైపు మొగ్గు చూపడం లేదు. కొంతమంది అభ్యుదయ రైతులు శ్రీకారం చుట్టినప్పటికీ అటువంటి సమయాల్లోనే కూరగాయల ధరలు తగ్గిపోతుండడంతో వారికి నష్టం కలిగి మళ్లి సాగు చేయడం లేదు. చెన్నై, కర్నాటక, ఆంధ్ర రాష్ట్రాలకు సంబంధించి వాతావరణాన్ని అధ్యయనం చేయడం సరైన కార్యాచరణ ప్రణాళిక రూపొందించి రైతులకు ప్రభుత్వం అండగా నిలబడగలిగితే విపత్కర సమయాల్లో కూడా ఇటువంటి ధరలు పెరిగే సంఘటనలు ఉండవని , అలాగే ధరలు తగ్గి రోడ్లపై కూరగాయలు పారబోసుకునే సంఘటనలు కూడా చోటుచేసుకోవని వ్యవసాయ రంగ , మార్కెటింగ్ నిపుణుల అభిప్రాయంగా ఉంది .
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital