Saturday, November 23, 2024

తెలంగాణ ప్రజలంతా హ్యాపీగా ఉండాలి.. యాదాద్రిలో గవర్నర్‌ తమిళిసై

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ రాష్ట్ర ప్రజలందరికీ అనుకూలంగా ఉండాలని రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ ఆకాంక్షించారు. యాదాద్రి ఆలయాన్ని ఆమె సోమవారం సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మీడియా ప్రతినిధులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానమిచ్చారు. అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలను తన ప్రసంగం లేకుండానే ప్రారంభించారని అడిగిన ప్రశ్నకు ఆమె స్పందిస్తూ తన వైఖరిని ఇప్పటికే వెల్లడించానని పేర్కొన్నారు. బడ్జెట్‌ ప్రవేశ పెడుతున్న సందర్భంగా రాష్ట్ర ప్రజలకు తన శుభాకాంక్షలని చెప్పారు. తెలంగాణ ప్రజలందరూ సంతోషంగా ఉండడమే తనకు కావాలని బడ్జెట్‌ ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తుందని ఆమె పేర్కొన్నారు. తాను తమిళనాడు రాష్ట్రానికి చెందినప్పటికీ తెలంగాణ ప్రజలతో తన బంధం పెనవేసుకుని ఉందని చెప్పారు. రాష్ట్ర ప్రజలు తననెంతో అభిమానిస్తూ ఆప్యాయతను ప్రదర్శిస్తున్నారని ప్రజలను మరిచిపోలేనని చెప్పారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ వల్ల రాష్ట్రంలో ప్రతి ఒక్కరు లబ్ధి పొందుతారన్న ఆశాభావం తనకుందని చెప్పారు.

అంతకు ముందు యాదాద్రికి చేరుకున్న గవర్నర్‌ తమిళిసైకి ఆలయ అర్చకుల పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. పోలీసుల గౌరవ వందనం స్వీకరించి యాద్రిద్రి ప్రధాన ఆలయాన్ని సందర్శించారు. స్వయంభు మూర్తులను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. యాదాద్రి గుట్టపై జరుగుతున్న బ్రహ్మోత్సవాలను అడిగి తెలుసుకున్నారు. సోమవారం నాలుగోరోజు వటపత్రసాయి అలంకార సేవలో లక్ష్మీ నరసింహస్వామిని గవర్నర్‌ దర్శించి పూజలు నిర్వహించారు. యాదాద్రి ఆలయాన్ని అద్భుతంగా నిర్మించారని కొనియాడారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement