హైదరాబాద్, ఆంధ్రప్రభ : తెలంగాణ కాంగ్రెస్ నాయకుల్లో నెలకొన్న సమస్యలన్ని ముగిశాయని, ఇక ఎలాంటి ఇబ్బందులు ఆల్ సెటిల్డ్- నో ప్రాబ్లం) ఉండవని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్‌సింగ్ అన్నారు. ‘ నేతల మధ్య ఏమైనా విబేధాలుంటే పార్టీలో అంతర్గతంగా మాట్లాడి చర్చించుకోవాలి. మీడియా ముందుకు రావద్దు. చేతులు జోడించి చెబుతున్నాను. పార్టీ సీనియర్లు సంయమనం పాటించాలి ‘ అని ఆయన సూచించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ప్రజా వ్యతిరేకత ఉందని, ప్రజలెవ్వరు సంతోషంగా లేరని ఆయన విమర్శించారు. శుక్రవారం ఆయన గాంధీభవన్‌లో పార్టీ నేతలు వి. హనుమంతరావు, శ్రీధర్‌బాబు, అంజన్‌కుమార్‌యాదవ్, పొన్నం ప్రభాకర్, షబ్బీర్‌అలీ, మల్లు రవితో కలిసి మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందని, ఈ సమయంలో నాయకులంతా ఐక్యంగా ఉండి పోరాడితేనే ప్రత్యర్థులను ఓడించి అధికారంలోకి వస్తామని ఆయన పేర్కొన్నారు.
టీ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఇదివరకే తనను కలిసి సమస్యలను వివరించారని తెలిపారు. తెలంగాణలోని పార్టీ పరిస్థితులపై చర్చించినట్లు ఆయన తెలిపారు. కొత్తవారికి పీసీసీ చీఫ్ ఇచ్చిన సందర్భాలున్నాయని ఆయన గుర్తు చేశారు. పార్టీలోకి వచ్చాక అందరు సమానమేనని, కొత్త, పాత అని తేడాలు ఉండవన్నారు. పీసీసీ లేదా ఇన్చార్జ్ మార్పులు ఉంటాయా..? అని మీడియా ప్రశ్నించగా.. ఆ విషయం అధిష్టానం పరిధిలో ఉందని దిగ్విజయ్‌సింగ్ సమాధానమిచ్చారు.
ఇద్దరు ఎంపీలతోనే తెలంగాణ వచ్చిందా..?
తెలంగాణ ఇస్తామన్న మాటను కాంగ్రెస్ నిలబెట్టుకుందన్నారు. కేసీఆర్ ఇద్దరు ఎంపీలతో తెలంగాణ తీసుకువచ్చారా..? అని దిగ్విజయ్‌సింగ్ ప్రశ్నించారు. కాంగ్రెస్ లేకుండా తెలంగాణ లేదని, 2004లో ఇచ్చిన మాటను 2014లో కాంగ్రెస్ నిలబెట్టుకున్నదని వివరించారు. తెలంగాణ ప్రజలను సీఎం కేసీఆర్ మోసం చేశారని, ప్రజలకిచ్చిన హామీలను విస్మరించారని ఆయన తెలిపారు. రాష్ట్రంలో కుటుంబ పాలన సాగుతోందని ఆయన మండిపడ్డారు. బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఒకలా.. ఢిల్లిdలో మరోలా ప్రవర్తిస్తోందన్నారు. పార్లమెంట్ ఉభయ సభల్లో బీజేపీతో బీఆర్ఎస్ దోస్తీ చేస్తోందని, బయట మాత్రం కుస్తీ చేస్తున్నట్లు నటిస్తోందని దిగ్విజయ్‌సింగ్ విమర్శించారు. బీజేపీకి మద్దతు పలికేందుకే కేసీఆర్ బీఆర్ఎస్ను ఏర్పాటు చేశారన్నారు. బీఆర్ఎస్ బలహీనంగా ఉన్నందునే కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారని ఆయన విమర్శించారు. అవినీతిలో రికార్డు సృష్టించారని ఆయన ఆరోపించారు.
ప్రత్యర్థులపై దర్యాప్తు సంస్థలతో దాడులు..
‘ బీజేపీ పాలనలో పేదరికం పెరుగుతోంది. మోడీ ప్రభుత్వం సంపన్నులకే ప్రయోజనం కలుగుతోంది. ధరల పెరుగుదల, నిరుద్యోగం ఇంతలా పెరగడం ఎన్నడు చూడలేదు. ప్రత్యర్థులపై దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పతున్నారు. నిర్దోషులను దోషిలుగా చిత్రించే ప్రయత్నం చేస్తున్నారు. హింసను, ద్వేషాన్ని ప్రజల్లో నింపుతున్నారు. తప్పుడు కేసుల్లో ఇరికించి బెయిల్ రాకుండా అడ్డుకుంటున్నారు’ అని ఆయన పేర్కొన్నారు.
బీజేపీకి పరోక్షంగా మజ్లిస్ పార్టీ మద్దతు..
కేసీఆర్ అమలు చేస్తామన్న 12 శాతం ముస్లిం రిజర్వేసన్లపై ఎంఐఎం నేత అసదుద్దీన్ ఓవైసీ ఎందుకు మాట్లాడటం లేదని ఆయన నిలదీశారు. బీజేపీని గెలిపించేందుకే ఎంఐఎం దేశ వ్యాప్తంగా పోటీ చేస్తోందని దిగ్విజయ్‌సింగ్ ఆరోపించారు. కాంగ్రెస్ హయాంలో రాజశేఖర్‌రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్లు అమలు చేశామని, దీంతో ముస్లింలకు లబ్ది జరుగుతోందని ఆయన వివరించారు. దేశంలో ఎన్నో జరగరాని ఘటనలు జరుగుతున్నా ఎంఐఎం మాట్లాడటం లేదని ఆయన నిలదీశారు.
రాహుల్ పాదయాత్రను అడ్డుకునే ప్రయత్నాలు..
రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో పాదయాత్రను అడ్డుకునే ప్రయత్నాలు బీజేపీ ప్రభుత్వం చేస్తోందని దిగ్విజయ్‌సింగ్ మండిపడ్డారు. రాహుల్ యాత్రలో బీజేపీ ప్రభుత్వం తప్పిదాలను ఎత్తి చూపుతుంటే.. కాంగ్రెస్ పార్టీకి ప్రజల్లో మద్దతు లభిస్తోందని, అందుకనే కరోనా పేరుతో యాత్రను అడ్డుకోవాలని కుట్రలు చేస్తున్నారని ఆయన విమర్శించారు. దేశంలో ఏమైనా మెడికల్ ఎమెర్జెన్సీ పెట్టారా..? విదేశాల నుంచి వచ్చే విమానాలను ఎందుకు నిలుపదల చేయలేదు..? అని దిగ్విజయ్‌సింగ్ నిలదీశారు. దేశంలో కరోనా విపత్తు లేదని వైద్య నిపుణులు చెబుతున్నారని ఆయన తెలిపారు. కరోనాపై ప్రధాని మొదటిసారి మాట్లాడారని, అంతకు ముందే రాహుల్‌గాంధీ కేంద్ర మంత్రికి లేఖ రాశారని ఆయన గుర్తు చేశారు.