Saturday, November 23, 2024

ఇక ప్ర‌క్షాళ‌నే…..

వంద మందికి పైగా ఐఏఎస్‌, ఐపీఎస్‌లకు స్థానచలనం…
సంక్రాంతి తర్వాత భారీ మార్పులు
సీఎంవోలో కొత్త అధికారులు
ఎన్నికల నేపథ్యంలో వ్యూహాత్మకంగా ప్రక్రియ
పైరవీలకు నో ఛాన్స్‌… పక్కాగా కేసీఆర్‌ మార్క్‌
మెజారిటీ జిల్లాలకు కొత్త కలెక్టర్‌లు
8వ తేదీ తర్వాత ఫైల్‌పై సంతకం
26లోగా బదిలీలు పూర్తి

పలు జిల్లాల కలెక్టర్లకు ఇప్పటికే సంకేతాలు కూడా అందాయి. 2020లో ఒకేసారి 50మంది ఐఏఎస్‌ల బదిలీ జరగ్గా, మూడేళ్ళ తర్వాత మళ్ళీ అంతకంటే పెద్దస్థాయిలో బదిలీల జాతర జరగబోతున్నట్లు తెలుస్తోంది. అధికారయంత్రాంగంలో సమూల మార్పులకు సీఎం శ్రీకారం చుట్టి.. మిగిలిన పాలనాకాలాన్ని నవ్యోత్సాహంతో ప్రజలను సంతృప్తిపరిచేలా, సంక్షేమాన్ని గుర్తుచేసేలా కార్యాచరణ తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది…

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ ముఖ్యప్రతినిధి: అధికార యంత్రాంగంలో సమూల ప్రక్షాళనకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్ణయించారు. సంక్రాంతి తర్వాత భారీగా కలెక్టర్లు, ఐఏఎస్‌ల బదిలీలు జరగనున్నాయి. ఈ సారి సీఎంవోలోకి కూడా కొత్త అధికారులు చేరే అవకాశం ఉందని చెబుతు న్నారు. తెలంగాణ వ్యాప్తంగా వంద మందికిపైగా ఐఏఎస్‌, ఐపీఎస్‌ల బదిలీలు జరగనున్నాయి. ఇటీవల కొందరు ఐఏఎస్‌ల బదిలీలు జరగ్గా, తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల ఎస్పీలను కూడా మార్చే అవకాశం కనబడుతోంది. గత ఎన్నికల్లో అప్పటి ఎపీ సీఎం చంద్రబాబు అనుభవాలను దృష్టిలో పెట్టుకుని, మంత్రులు, ఎమ్మెల్యేలు సిఫార్సుచేసిన వారిని కూడా.. భవిష్యత్తు అవసరాలు, ఎన్నికల పరిస్థితు లను దృష్టిలో పెట్టుకుని సీఎం కేసీఆర్‌ తన మార్క్‌ కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. మరో ఆరుమాసాల తర్వాత ఏ క్షణ మైనా.. ఎన్నికలు జరిగే అవకాశం ఉండడంతో.. ప్రభుత్వం తనదైన శైలిలో అధికార యంత్రాంగంలో కీలక మార్పులు చేయనుంది. తెలంగాణ సీఎస్‌గా శాంతికుమారిని నియమించడం ద్వారా పక్కాగా తనదైన మార్క్‌ను ప్రదర్శించిన కేసీఆర్‌ వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని జిల్లాలకు ఎక్కువమంది కన్ఫర్డ్‌ ఐఏఎస్‌లను కలెక్టర్లను నియమించే అవకాశం ఉందన్న చర్చ జరుగుతోంది. సమర్ధత నిజాయితీ కలిగిన అధికారులకు మంచి పోస్టింగ్‌లు దక్కే అవకాశం లభించే అవకాశముంది. జిల్లాల్లో సుదీర్ఘకాలంగా పనిచేసిన అధికారులను సమర్ధత, విధేయత ఆధారంగా తర్వాత పోస్టింగ్‌లు ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో దాదాపు 20నుండి 25జిల్లాలకు కొత్త కలెక్టర్లు రానున్నట్లు తెలుస్తోంది. చాలా కాలంగా.. కలెక్టర్ల బదిలీలు జరగకపోగా, సంక్రాంతి తర్వాత బదిలీలు జరగబోతున్నాయని సమాచారం.

అధికారులకు సంకేతాలు
పలు జిల్లాలకు పూర్తిస్థాయి కలెక్టర్లు లేకపోగా, తెలంగాణ వచ్చినప్పటి నుండి కూడా.. ఒకే పొజిషన్‌లో పనిచేస్తున్న పలువురు అధికారులు ఉన్నారు. వీరికి స్థానభ్రంశం కలిగించే అవకాశాలున్నాయి. ఆదిలాబాద్‌ కలెక్టర్‌ సిక్తాపట్నాయక్‌ ను సీఎంవోకు బదిలీచేస్తారన్న ప్రచారముంది. ఇటీవల పదోన్నతి లభించిన నేపథ్యంలో ఆదిలాబాద్‌, నిర్మల్‌ కలెక్టర్లకు స్థానచలనం కలగనుంది. వికారాబాద్‌ కలెక్టర్‌ ను బదిలీచేయనున్నారు. పలు శాఖలకు ఇన్‌ఛార్జి అధికారులే ఉన్నారు. ఇటీవల కాలంలో సిీఎస్‌గా ఉన్న సోమేష్‌ తో ఐఏఎస్‌ల బదిలీలపై సీఎం పలుమార్లు చర్చించారు. జాబితాలు రూపొందించారు. ఇపుడు సిీఎస్‌గా అనూహ్యంగా శాంతికుమారి రాగా, కొత్తటీమ్‌పై సీఎం కసరత్తు చేస్తున్నారు. సమీకృత జిల్లా కలెక్టర్ల భవనాలను వ్యూహాత్మకంగా ప్రారంభిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌.. ఇతర రాష్ట్రాలలో మంత్రుల ఛాంబర్లు కూడా ఇలా లేవని పంజాబ్‌ స్పీకర్‌ చేసిన వ్యాఖ్యలు ఉటంకిస్తున్నారు.

పాలనాపరంగా, ఎన్నికల పరంగా కలెక్టర్లు ఆయా జిల్లాల్లో కీ రోల్‌ పోషించే అవకాశం ఉండడంతో పోస్టింగ్‌లపై అత్యంత జాగ్రత్తగా నివేదికలు తెప్పిం చుకుని, రికార్డు పరిశీలించి ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. గురువారం రెండు జిల్లాల్లో కలెక్టరేట్లు ప్రారంభించిన సీఎం కేసీఆర్‌ ఈనెల 18న ఖమ్మం కలెక్టరేట్‌ ప్రారంభించనున్నారు. 33జిల్లాల్లో.. ఒకే నమూనాతో కలెక్టరేట్లు నిర్మిస్తూ.. తెలంగాణను మోడల్‌గా నిలపగా, కొత్త టీమ్‌ను నియమించి పాలనాయంత్రాంగానికి సీఎం కేసీఆర్‌ సరికొత్త దిశానిర్దేశం చేయనున్నారు. ప్రజల సేవలో మరింతగా ముందుకు సాగేలా.. ప్రభుత్వ లక్ష్యాలను నిబద్దతతో అమలుచేసేలా లక్ష్యాలు నిర్దేశించను న్నట్లు తెలుస్తోంది. 18న ఖమ్మం సభ తర్వాత.. బదిలీలపై సీఎం సంతకం చేయవచ్చని, జనవరి 26లోగా అన్నీ పూర్తవుతాయన్న సంకేతాలు తాజాగా ప్రభుత్వ ఉన్నతస్థాయి వర్గాల్లో వినబడుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement