Friday, November 22, 2024

కర్నాట‌క‌లో సీట్ల కోసం సిగప‌ట్లు – అన్నిపార్టీలోనూ తిరుగుబాటు త‌ల‌పోట్లు..

బెంగళూరు: కర్నాటక భారతీయ జనతా పార్టీలో కంటికి కనిపించనంత సంక్షోభం లోలోన రగులుతున్నట్టు అనిపిస్తున్నది. అసెంబ్లి ఎన్నికలకు అభ్యర్ధుల ఎంపిక అధిష్టానా నికి తలనొప్పిలా పరిణమించినట్టు తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. మొదటి జాబితా కోసం ఇదిగో అదిగో అన్నట్టు పార్టీ నేతలు, కార్యకర్తలు ఎదురుచూస్తుండగా అది ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ వచ్చింది. చివరకు మంగళవారం రాత్రి 189 మంది అభ్యర్థులతో తొలిజాబితా విడుదలైంది. ఇందు లో 52 కొత్త ముఖాలున్నాయి. మొన్న జరిగిన పార్టీ అభ్యర్ధుల ఎంపిక కమిటీ సమావేశంలో ప్రధాని మోడీ సైతం తొలి జాబితా చూసి అసంతృప్తి వ్యక్తం చేసినట్టు చెబుతున్నారు. అందులో పార్టీ నేతల కుటుంబ సభ్యులు, బంధువుల పేర్లే ఎక్కువగా ఉన్నట్టు ప్రధాని మోడీ గుర్తించినట్టు చెబుతున్నారు. అందుకే ఆ జాబితాను పక్కన పెట్టినట్టు తెలిసింది. అంతేకాదు. ఏకంగా అభ్యర్ధుల ఎంపిక ప్రక్రియ నే సమూలంగా మార్చేయాలని ఆయన ఆదేశిం చినట్టు తెలిసింది. గుజరాత్ నమూనాలో ఎంపిక ప్రక్రియ జరపాలని కూడా ఆయన ఆదేశించినట్టు తెలిసింది. దీని ప్రకారం భారీ సంఖ్యలో సిట్టింగ్‌ ఎమ్మెల్యేలను పక్కన పెట్టి కొత్త అభ్యర్ధుల్ని ఎంపిక చేశారు. ప్రజల ముందుకు స్వచ్ఛమైన నిష్కళంక అభ్యర్ధుల్ని ఉంచాలన్న లక్ష్యంతో కొత్త అభ్యర్దుల కోసం తీవ అన్వేషణ చేసి ఎలాగోలా ముగించారు. ముఖ్యంగా అవినీతి ఆరోపణలను ఎదుర్కొంటున్న వారిని నిర్దాక్షిణ్యంగా పక్కన పెట్టారు.

52 మంది అభ్యర్ధుల్ని మార్చారు. అలాగే మెరుగైన పనితీరు కనబరచని వారిని కూడా పక్కనపెట్టారు. ఈసారి రాష్ట్ర బీజేపీలోని పెద్ద తలకాయల్లో చాలామందిని పక్కన పెట్టే అవకాశాల్ని కొట్టిపారేయలేమని వారు ముందునుంచే చెప్పారు. మంత్రులు, మాజీ మంత్రులు, సీనియర్లలో పలువురు ఈసారి టిక్కెట్లు సంపాదించలేకపోతే ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదని సంకేతాలిచ్చారు. కాంగ్రెస్‌, జేడీఎస్‌ నుంచి ఫిరాయించి ప్రభుత్వంలో మంత్రి పదవులు పొందిన వారికి ఢోకా ఉండదని కూడా చెబుతున్నారు.
మాజీ ముఖ్యమంత్రి యొడ్యూరప్ప కొడుకు విజయేంద్రతో పాటు పలువురు సీనియర్‌ నేతల కుమారులు మొదటి జాబితాలో ఉండగా ప్రధాని మోడీ ఇలాంటి వారి పేర్లు తొలగించాల్సిందిగా ఆదేశించినట్టు చెబుతున్నారు. హౌసింగ్‌ మంత్రి వి సోమన్న కొడుకు అరుణ్‌ సోమన్న, జల వనరుల మంత్రి గోవింద్‌ కర్జోల్‌ కొడుకు గోపాల్‌ కర్జోల్‌, దావణగేరె ఎంపీ జిఎం సిద్దేశ్వర కొడుకు అనిత్‌ కుమార్‌, మాజీ మంత్రి కెఎస్‌ ఈశ్వరప్ప కొడుకు కెయి కంతేష్‌ తదితరులు టిక్కెట్లు ఆశిస్తున్న వారి జాబితాలో ఉన్నారు. యొడ్యూరప్ప లాంటి కొందరు సీనియర్లు పార్టీ నియమావళి ప్రకారం తమ కుటుంబీకుల కోసం తాము ఎన్నికల బరికి దూరంగా ఉండేందుకు సమ్మతించారు. ఒక కుటుంబానికి ఒకే టిక్కెట్‌ నియమావళిని గట్టిగా అమలుచేయాలని పార్టీ అధిష్టానం ఖచ్చితంగా చెప్పింది. అయితే ప్రముఖుల కుటుంబ సభ్యులు టిక్కెట్ల కోసం ఎగబడటం పట్ల ప్రధానమంత్రి మోడీ తీవ్ర అసంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో ఎంపిక ప్రక్రియ సంక్లిష్టంగా మారింది.

కొత్త జాబితా విడుదలతో పార్టీలో అసంతృప్తుల బెడద పెరుగుతుందన్న ఆలోచనలో అధిష్టానం ఉంది. అలాంటి అసంతృప్తిని కనీస స్ధాయికి తగ్గించే పనిలో భాగంగా వీలైనంత వరకు జాప్యం చేసి చిట్టచివరి నిమిషంలో జాబితా విడుదల చేశారు. ఈనెల 20కల్లా నామినేషన్ల ప్రక్రియ పూర్తి కావాల్సి ఉంది. ఆలోగా 190 మంది అభ్యర్ధుల జాబితా విడుదల చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి.
మరోవంక కాంగ్రెస్‌ పార్టీ మూడో జాబితా విడుదల చేయాల్సి ఉంది. అదే చివరి జాబితా అవుతుంది. అయితే దీని దగ్గరే కాంగ్రెస్‌ పార్టీలో విభేదాలు తలెత్తాయి. దీంతో జాబితా ఆలస్యమవతున్నది. 58 మంది అభ్యర్ధుల జాబితా త్రిశంకుస్వర్గంలో ఉంది. గుల్బర్గా నుంచి లింగాయతుల్లో పలుకుబడి ఉన్న నాగరాజ్‌ చబ్బీ తిరుగుబాటు చేసి బీజేపీలో చేరారు. బెంగళూరు సిటీ నుంచి అఖండ శ్రీనివాస్‌కి మళ్లి టిక్కెట్‌ ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తున్నారు. శ్రీనివాస్‌కు సిద్దరామయ్య మద్దతు ఉన్నది. కాంగ్రెస్‌ గనక తనకు టిక్కెట్‌ ఇవ్వకపోతే బీజేపీకి వెళ్లిపోతానంటూ శ్రీనివాస్‌ అల్టిమేటం ఇచ్చారు. అనేక కీలకమైన స్ధానాల్లో కాంగ్రెస్‌ అభ్యర్ధుల ఎంపిక కత్తిమీద సాములా మారింది.

ఇక జనతాదళ్‌(సెక్యులర్‌) పార్టీ పరిస్థితీ ఇందుకు భిన్నంగా లేదు. అయితే ఆ పార్టీలో కుటుంబ కలహాలే ప్రముఖంగా ఉన్నాయి. హెచ్‌.డి. దేవెగౌడ ఇద్దరు కుమారుల మధ్య గొడవ ఇది. రేవణ్ణ భార్యకు టిక్కెట్‌ విషయంలో ఇద్దరు అన్నదమ్ముల మధ్య తీవ్రస్ధాయిలో వివాదం నడుస్తున్నది. హస్సన్‌ నియోజకవర్గం టిక్కెట్‌ తన భార్య భవాని రేవణ్ణకి ఇచ్చి తీరాలని రేవణ్ణ పట్టుపడుతున్నారు. కుమారస్వామి హెచ్‌పి స్వరూప్‌ అనే కార్యకర్తకు మద్దతుగా నిలబడ్డారు. రేవణ్ణ కుటుంబమైతే యుద్దమే ప్రకటించింది. నెల క్రితం జేడీ(ఎస్‌) 95 మంది అభ్యర్ధులతో మొదటి జాబితా ప్రకటించింది. మిగతా అభ్యర్ధుల విషయంలో మీనమేషాలు లెక్కిస్తున్నది. చివరి నిమిషం దాకా వేచి చూడాలన్నది వ్యూహంగా ఉంది. కాంగ్రెస్‌, బీజేపీల్లో తిరుగుబాటు చేసే బలమైన అభ్యర్ధులు దొరికితే వారిని తీసుకోవాలన్నది దేవెగౌడ్‌ ఆలోచనగా ఉంది.
ఇక ప్రచారం విషయానికొస్తే, బీజేపీలో యెడ్యూరప్ప హవాకి కాలం చెల్లినట్టే. ఆయన ప్రధాన ప్రచారకర్త కాదు. ప్రధాని మోడీ, ఇతర జాతీయ నాయకులే ప్రచార బాధ్యతలను తలకెత్తుకుంటున్నారు. వచ్చే నాలుగు వారాల్లో ప్రధాని మోడీ ఇరవై బహిరంగ సభలు, ఎనిమిది రోడ్‌ షోల్లో పాల్గొంటారు. అమిత్‌ షా ఇరవైరెండు బహిరంగ సభల్లో పాల్గొంటారు. వీరుగాక ఉత్తరప్రదేశ్‌, అసోం రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఒక్కొక్కరు 18 సభల్లో ప్రసంగించేలా ప్రణాళిక రూపొందించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement