Friday, November 22, 2024

సాగర్ ఎన్నికలు.. ఈ అఖరి 5 రోజులు!

నాగార్జునసాగర్​ ఎన్నికల రాజకీయం హీటెక్కింది. నాగార్జునసాగర్‌ ఉపఎన్నికకు  మరో 5 రోజులు మాత్రమే సమయం మిగిలి ఉండటం వల్ల పార్టీలన్నీ ప్రచారంలో జోరు పెంచాయి. గెలుపే లక్ష్యంగా ప్రధాన పార్టీల నేతలు తమ అభ్యర్థులు తరుపున ప్రచారంతో దూసుకుపోతున్నారు. అధికార, ప్రతిపక్ష పార్టీలకు చెందిన ముఖ్యనేతలంతా… గ్రామాల్లో విస్తృతంగా పర్యటిస్తూ… ప్రత్యర్థులను చిత్తుచేసేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. అధికార పార్టీ మంత్రులను, ఎమ్మెల్యేలను, జిల్లాల ముఖ్యనేతలను రంగంలోకి దించుతుండగా… ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీ జాతీయ, రాష్ట్ర స్థాయి నాయకులను ప్రచారానికి తీసుకువస్తోంది. సిట్టింగ్‌ స్థానం, ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికల గెలుపు ఉత్సాహంతో ముందుకు సాగుతున్న టీఆర్ఎస్… సర్వశక్తులొడ్డుతూ సత్తాచాటేందుకు యత్నిస్తోంది. ఈ నెల 14న సీఎం కేసీఆర్ సైతం ప్రచారం చేయనున్నారు. జానారెడ్డి లాంటి సీనియర్ నేత బరిలో ఉండడంతో టీఆర్ఎస్ ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. భారీ బహిరంగ సభతో ఫైనల్ టచ్ ఇవ్వాలని కేసీఆర్ భావిస్తున్నారు. ఆయన సభకు సంబంధించిన ఇప్పటికే టీఆర్ఎస్ శ్రేణులు ఏర్పాట్లు చేస్తున్నాయి.

మరోవైపు సాగర్  బై ఎలక్షన్​ కాంగ్రెస్​కు సవాల్​గా మారింది. పార్టీలోనే కాదు, రాజకీయాల్లోనూ అందరూ ‘పెద్దలు’ అని సంబోధించే జానారెడ్డి కాంగ్రెస్​ తరఫున బరిలో ఉన్నారు. ఆయన గెలుపోటములపై ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. కాంగ్రెస్‌ తరఫున సీనియర్‌ నేత జానారెడ్డి బరిలో ఉండటం, ప్రభుత్వ వ్యతిరేకతతో తమ గెలుపు తథ్యమని హస్తం పార్టీ ధీమాతో ఉంది. జానారెడ్డి చేసిన అభివృద్ధి, ప్రజల్లో ఆయనకు ఉన్న సానుభూతి తమకు అనుకూలంగా ఉంటుందని కాంగ్రెస్ పార్టీ నేతలు భావిస్తున్నారు. జానారెడ్డి గెలుపుతో రాష్ట్ర రాజకీయాల్లో పెనుమార్పులు రాబోతున్నాయని హస్తం  నేతలు అంటున్నారు. టీఆర్ఎస్ నేతలు డబ్బు, మద్యంతో గెలుపొందాలని యత్నిస్తున్నారని కాంగ్రెస్ ఎంపీలు ఉత్తమ్, కోమటిరెడ్డిలు ఆరోపించారు. రాబోయే శాసనసభ ఎన్నికల్లో జానారెడ్డి తమ సీఎం అభ్యర్థిగా ఒప్పిస్తామని స్పష్టం చెశారు.

రెడ్డి లీడర్లంతా కాంగ్రెస్​ అభ్యర్థి జానారెడ్డిని గెలిపించేందుకు అంతర్గతంగా ఏకమైనట్లు స్థానికంగా చర్చ నడుస్తోంది. ఈసారి జానారెడ్డిని గెలిపించుకోకపోతే భవిష్యత్తులో నియోజవకర్గం తమ చేతుల్లో ఉండదనే భయం రెడ్డి లీడర్లలో  ఉన్నట్లు తెలుస్తోంది. ఎస్సీ, ఎస్టీలను సమీకరించే పనిని కూడా రెడ్డి లీడర్లే తీసుకున్నట్లు సమాచారం. యాదవ, ఇతర బీసీ కులాలను ఎట్లా సమీకరించాలనే అంశంపైనా వీళ్లు దృష్టి పెట్టినట్లు కొందరు నేతల మాటలను బట్టి తెలుస్తోంది. మరోవైపు పీసీసీ చీఫ్​ పదవిని ఆశిస్తున్న నేతలు మరింత ఎక్కువ ఉత్సాహంతో ప్రచారం సాగిస్తున్నారు. రాష్ట్ర కాంగ్రెస్​కు అధ్యక్షుడ్ని నియమించాలని పార్టీ హైకమాండ్​ కసరత్తు మొదలుపెట్టిన సమయంలోనే సాగర్ ఉప ఎన్నిక జరుగుతోంది. దీంతో ఈ ఎన్నిక​  తర్వాతే పీసీసీకి కొత్త అధ్యక్షుడ్ని నియమించాలని హైకమాండ్​ నిర్ణయించింది.

ఇక బీజేపీ సైతం ప్రచారంలో దూసుకుపోతోంది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఇవాళ సాగర్ లో ప్రచారం చేయనున్నారు.  దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో వరుస విజయాలతో మంచి ఊపు మీదున్న బీజేపీ.. సాగర్ లోనూ తమ సత్తాచాటాలని భావిస్తోంది. ఇందులో భాగంగా కేంద్ర మంత్రులు, రాష్ట్రస్థాయి నేతలతో జోరుగా ప్రచారం సాగిస్తోంది. ఇప్పటికే కిషన్ రెడి సహా ముఖ్య నేతలు ప్రచారం నిర్వహించారు.

2018 ఎన్నికల్లో సాగర్​ నుంచి పోటీ చేసిన బీజేపీ అభ్యర్థి నివేదితారెడ్డి 2 వేల పైచిలుకు ఓట్లు మాత్రమే సాధించారు. మూడేళ్ల వ్యవధిలో వచ్చిన ఈ ఉప ఎన్నికను  తమకు అనుకూలంగా మలుచుకోవాలని బీజేపీ భావిస్తోంది. జనరల్ సీటు అయిన సాగర్​ నియోజకవర్గంలో గిరిజన(లంబాడా) కమ్యూనిటీకి చెందిన రవినాయక్ ను బరిలోకి దింపి.. గిరిజనుల ఓట్లపై  ఆశలు పెట్టుకుంది. గుర్రంపోడులో గిరిజనుల భూములపై తాము చేసిన పోరాటం  కలిసి వస్తుందని బీజేపీ ధీమా వ్యక్తం చేస్తోంది. మొత్తం మీద అన్ని పార్టీలు పోటాపోటీగా ప్రచారంలో దూసుకుపోతున్నాయి. 

Advertisement

తాజా వార్తలు

Advertisement