Tuesday, November 26, 2024

Spl Story: ప్రేమ కథలన్నీ​ ఒకెలా ఉండవు​.. ఎల్లలు లేని ప్రేమకు పెళ్లితో ఎండ్​కార్డ్!​

చరిత్రలో మనం ఎన్నో ప్రేమ కథలు, మరెన్నో లవ్​ స్టోరీస్​ని విని ఉంటాం.. సినిమాల్లోనూ చూసి ఉంటాం. కానీ, మనకు తెలిసిన వారు ‘‘ప్రేమించుకుంటున్నాం, పెళ్లి చేసుకుంటాం”అంటే మాత్రం అస్సలు ఒప్పుకోలేం. ఎందుకంటే.. వేరే వాళ్ల ప్రేమ కథలు విన్నప్పుడు సంతోషంగానే అనిపిస్తాయి. కానీ, వాటి లోతుపాతుల్లోకి వెళ్తే అంతులేని విషాదాలు ఉంటాయి. అందుకనే తమ కుటుంబ సభ్యులో, దగ్గరివారో లవ్​ పేరు ఎత్తగానే అంతెత్తున ఎగిరి ఆగమాగం చేస్తారు పెద్దలు. ఇది వారిపై ఉన్న ప్రేమ, ఆప్యాయతతోనే కానీ.. మరో విషయం కాదన్నది అర్థం చేసుకోవడానికి చాలా టైమ్​ పడుతుంది.  

– నాగరాజు చంద్రగిరి, ఆంధ్రప్రభ

అచ్చం.. ఇట్లాంటిదో ఇప్పుడో స్టోరీ చెప్పుకోబోతున్నాం. అయితే, లైలా–మజ్నూ, రోమియో– జూలియట్​ వంటి అమర ప్రేమికుల స్టోరీ మాత్రం కాదు..  ఇది రెండు దాయాది దేశాల మధ్య నలుగుతున్న ప్రేమికుల సమస్య. తొలుత వారి ప్రేమ ఉత్తరాల పలకరింపులతో మొదలై, ఆ తర్వాత లవ్​ లెటర్స్​ను దాటుకుని.. ల్యాండ్​ ఫోన్​​, వాట్సాప్​ వీడియో కాల్స్​తో అంబుజా సిమెంట్​ కంటే గట్టి బంధంగా మారింది. అయితే.. దీనికి చాలా ఆటంకాలు ఎదురయ్యాయి. వాటన్నిటినీ దాటుకుని ఈ జంట ఈ నెల 10వ తేదీన అంటే రేపు (ఆదివారం) ఒక్కటి కాబోతోంది. మరి వీరికి మీ శుభాకాంక్షలు, ఆశీర్వాదాలు తప్పకుండా అందజేస్తారు కదూ..

అసలు కథ ఏంటంటే..

షుమైలా, కమల్ కళ్యాణ్ ఇద్దరు ప్రేమికులు.. వారి ప్రేమకు ఎట్లాంటి అడ్డంకులు రాబోవు అనుకున్నారు. అయితే.. పాకిస్తాన్​ దేశం లాహోర్‌లో జన్మించిన షుమైలా.. భారత​దేశం పంజాబ్‌లోని జలంధర్‌కు చెందిన ఆమె కాబోయే భర్త కమల్ కళ్యాణ్ వాట్సాప్ వీడియో కాల్స్ లో ప్రేమించుకున్నారు. ఐదు సంవత్సరాల క్రితం షుమైలా సోదరుడి వివాహం జరిగినప్పుడు కమల్ వారి పెళ్లి మొత్తాన్ని వాట్సాప్ వీడియో కాల్‌లో చూశాడు. అయితే.. కమల్ తండ్రి ద్వారా ఈ రెండు కుటుంబాలకు రిలేషన్​ కూడా ఉంది. షుమైలా కుటుంబానికి కమల్ తండ్రి ఓం ప్రకాష్​కు దగ్గరి బంధుత్వమే ఉంది.

- Advertisement -

1947లో దేశ విభజన సమయంలో ఓం ప్రకాశ్​ మాతృమూర్తి అయిన షుమైలా అమ్మమ్మ లాహోర్‌లో ఉండిపోయారు. ఇట్లా రెండు కుటుంబాలకు రిలేషన్​ ఉంది. అయితే.. షుమైలా, కమల్​ మొదట పోస్ట్ కార్డ్ లు, ఉత్తరాల ద్వారా.. ఆ తర్వాత ల్యాండ్‌లైన్ ఫోన్ కాల్స్​.. ఇప్పుడు వాట్సాప్ వీడియో కాల్‌ ద్వారా టచ్‌లో ఉన్నారు. షుమైలా బ్రదర్​ పెళ్లి.. ఈ రెండు కుటుంబాల వారిని వాట్సాప్ వీడియో కాల్​తో మళ్లీ కలిసిందని చెప్పుకోవాలి.

అయితే.. వీరి ప్రేమ ఇట్లా కొనసాగుతుండగా.. వారి వివాహానికి ఫస్ట్​ తల్లిదండ్రులు అడ్డుచెప్పారు. కానీ, చాలా డీప్​ లవ్​లో ఉన్న వారు చాలా కాలంగా ఒకరి కోసం ఒకరు ఎదురుచూశారు. ఎట్లైతేనేమి తల్లిదండ్రులను ఒప్పించగలిగారు. అంతకుముందే ఒకరి కుటుంబానికి ఒకరు పరిచయం ఉన్నందున వారు తమ రిలేషన్​ని నెక్ట్స్​ లెవల్​కి తీసుకెళ్లాలని అనుకున్నప్పుడు భారతదేశం, పాకిస్తాన్ మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ముఖ్యంగా పుల్వామా దాడి.. ఆ తర్వాత 2019లో బాలాకోట్ దాడుల నేపథ్యంలో ఇరు దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. దీంతో వారి వివాహ బంధం కొద్ది రోజులు వాయిదా పడింది. వారి సంతోషాలకు బ్రేక్​ పడింది.

అంతేకాదు.. ఇక్కడ మరో సమస్య వచ్చిపడింది. 2019లోనే ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన కొవిడ్​ షురువయ్యింది.. ఇది ప్రపంచాన్ని మొత్తం గడగడలాడించిన మహమ్మారి. ఇక.. షుమైలా, కమల్​కి తాము కలిసి జీవిస్తామన్న ఆశలు లేకుండా పోయాయి. 2020 నుండి 2022 ప్రారంభం వరకు ప్రపంచం మొత్తం లాక్‌డౌన్‌తో అతలాకుతలమైనప్పుడు వారి ప్రేమ, ఆశ మాత్రమే ఇద్దరి ఆత్మలను కలిసి ఉంచింది.

ఆపై.. జూన్ నెలలో షుమైలా, ఆమె కుటుంబ సభ్యులు ఎట్టకేలకు భారత రాయబార కార్యాలయం నుండి 45రోజుల వీసా పొందగలిగారు. దీంతో జులై 10న షుమైలా, కమల్​ కళ్యాన్​ వివాహం జరగనుంది. “ఇది కోర్టు వివాహం, సన్నిహిత కుటుంబ సభ్యులు.. స్నేహితులకు మాత్రమే రిసెప్షన్” అని వరుడు కమల్ కళ్యాణ్  తెలిపారు.

లాహోర్‌కు చెందిన తన కోడలు గురించి కమల్ తండ్రి ఓం ప్రకాష్ హర్షం వ్యక్తం చేశారు. “ఆమె నా మేనత్త మనవరాలు. దేశ విభజన సమయంలో మా అమ్మానాన్న పాకిస్థాన్‌లోనే ఉన్నారు. ఆ కోణంలో మేము బంధువులం. నా కొడుకు షుమైలా గురించి చెప్పగానే నేను ఆమెతో మాట్లాడటం మొదలుపెట్టాక నా భయాలన్నీ ఆవిరైపోయాయి. ఆమె మమ్మల్ని ఎంతో ఇష్టపడుతున్న మా బిడ్డగానే భావిస్తాం ” అని అభిప్రాయం వెలిబుచ్చాడు.

జలంధర్, లాహోర్ మధ్య సాంస్కృతికంగా చాలా తేడా లేదని షుమైలా చెబుతోంది. వాఘా-అట్టారీ మధ్య సరిహద్దు ఉంది. కాకపోతే మేమూ పంజాబీలమే. “మా భాష ఒకటే, మతం ఒకటే (క్రైస్తవులు ఇద్దరూ).. ఆచారాలు, సంప్రదాయాలు ఒకటే.. ఇక మాకు ఒకరంటే ఒకరం బాగా తెలుసు.” అని సంతోషంగా ఉంది.

షుమైలా సర్దుకుపోవడం చాలా కష్టం కదా.. అని ఆమె సోదరుడు వాజిద్‌ని అడగ్గా.. ప్రతి పెళ్లిలో చిన్న చిన్న సర్దుబాట్లు చేసుకోవాలని బదులిచ్చారు. “కుచ్ పానే కే లియే కుచ్ ఖోనా తో పడ్తా హై” (కొన్ని విషయాలను పొందడానికి.. కొన్ని విషయాలను వదులుకోవాలి) అని  అతను సానుకూలంగా చెప్పాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement