Friday, November 22, 2024

ఆ అయిదుగురే డ్రగ్స్‌ తీసుకున్నారు.. ల్యాబ్​ రిపోర్టుల ఆధారంగా కేసు నమోదు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన పుడింగ్‌ అండ్‌ మింట్‌ పబ్‌ కేసు దర్యాప్తులో పోలీసులు స్వల్ప పురోగతి సాధించారు. పోలీసుల దాడిలో దాదాపు 128 మంది పట్టుబడటం, అందులో చాలా మంది మద్యం సేవించినట్లు తేలడంతో పాటు పబ్‌ కౌంటర్‌లో డ్రగ్స్‌ పట్టుబడటంతో కేసు దర్యాప్తును పోలీసులు పూర్తి సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నారు. ఈ దర్యాప్తులో పబ్‌లో జరిగిన పార్టీలో పాల్గొన్న వారిలో కేవలం అయిదుగురు డ్రగ్స్‌ తీసుకున్నట్లు పోలీసులు నిర్ధారించారు. పబ్‌పై పోలీసులు దాడి చేసిన సమయంలో పట్టుబడ్డ వారిలో దాదాపు 47 మంది నుంచి పోలీసులు కొన్ని షాంపిల్స్‌ సేకరించారు. వీటిని ల్యాబ్‌కు పంపించడంతో పాటు సాంకేతికంగా దర్యాప్తును చేపట్టారు. ఈ పరీక్షలలో కేవలం అయిదుగురు మాత్రమే డ్రగ్స్‌ తీసుకున్నట్లు తేలినట్లు తెలిసింది.

అయితే ఆ అయిదుగురిపై నార్కోటిక్‌ చట్టం కింద కేసు నమోదు చేయాలని అధికారులు భావిస్తున్నారు. అంతకంటే ముందుగా మరిన్ని సాంకేతిక ఆధారాల కోసం పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఒకటికి రెండు సార్లు ల్యాబ్‌ రిపోర్టులను పరిశీలించడంతో పాటు సాంకేతికపరమైన అంశాలను కూడా నిపుణులతో చర్చించాలని అధికారులు నిర్ణయించారు. పబ్‌లో జరిగిన పార్టీలో పలువురు సంపన్నుల కుటుంబాలకు చెందిన వారుండటం, ఒకరిద్దరూ సెలబ్రిటీలు కూడా ఉండటంతో కేసులో ఏ మాత్రం తేడా వచ్చిన పరువు పోతుందన్న అభిప్రాయాన్ని అధికారులు వ్యక్తం చేస్తున్నారు. సాంకేతిక ఆధారాలు పూర్తి స్థాయిలో అందిన తర్వాత సదరు వ్యక్తులపై నార్కొటిక్‌ చట్టం కింద కేసు నమోదు చేయడంతో అప్పుడే పూర్తి స్థాయి వివరాలను మీడియాకు వెళ్ళడించాలని భావిస్తున్నారు. పుడింగ్‌ అండ్‌ మింట్‌పై దాడి చేయడం, పలువురు సెలబ్రిటీలు దొరకడంతో ఈ కేసు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది.

వాస్తవానికి తొలుత ఈ కేసులో డ్రగ్స్‌ తీసుకున్న వారెక్కువ మంది ఉన్నారన్న ప్రచారం జరిగింది. దీంతో పోలీసులు కేసును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని దర్యాప్తును అత్యంత పకడ్బంధీగా తీసుకున్నారు. ఈ కేసులో పోలీసులు బార్‌ నిర్వాహకుడితో పాటు మేనేజర్‌ను అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు. వీరి నుంచి పోలీసులు ఎలాంటి సమాచారాన్ని రాబట్టలేకపోవడంతో కేసు పురోగతి నత్తనడకన సాగింది. తాజాగా వచ్చిన ల్యాబ్‌ రిపోర్టుల ఆధారంతో కొంత పురోగతి కనిపిస్తుండటంతో త్వరలోనే మరిన్ని అరెస్టులకు అవకాశాలున్నాయని అంటున్నారు. అంతేకాకుండా డ్రగ్స్‌ తీసుకున్న వారిని విచారిస్తే డ్రగ్స్‌ సరఫరా చేసే వారితో పాటు మిగతా విశివరాలన్నీ వెల్లడయ్యే అవకాశాలున్నాయని చెబుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement