దేశంలోని ఐదు రాష్ట్రాలు కరోనా మరణాలను దాచిపెట్టాయి. ఈ జాబితాలో ఏపీ కూడా ఉంది. ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, ఢిల్లీల్లోనే దాదాపు 4.8 లక్షల మరణాలను లెక్కలోకి తీసుకోలేదని తెలుస్తోంది. గత ఐదు నెలల్లోనే 75 వేల మరణాలను బీహార్ దాచిందని ప్రభుత్వ గణాంకాల ద్వారా శనివారమే తెలిసింది. మరోవైపు మహారాష్ట్ర కూడా కరోనా మరణాల లెక్కలను సవరిస్తోంది. దీంతో గత 12 రోజుల్లోనే 8,800 మరణాలను మహారాష్ట్ర ప్రభుత్వం లెక్కల్లో చేర్చింది.
ఈ నేపథ్యంలో కరోనా మరణాలు ఎక్కడ నమోదైనా వాటిని కరోనా మరణాలుగానే పరిగణించాల్సిందేనని, వాటినీ లెక్కలోకి తీసుకోవాల్సిందేనని కేంద్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది. ఆరు రాష్ట్రాల్లో కరోనా మరణాల లెక్కల్లో తేడాలున్నాయన్న మీడియా కథనాల నేపథ్యంలో సుప్రీంకోర్టులో కేంద్రం 183 పేజీల అఫిడవిట్ ను దాఖలు చేసింది. ఈ నిబంధనను ఎవరు అతిక్రమించినా ఆ వైద్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
ఇప్పటిదాకా కేవలం ఆసుపత్రుల్లో మరణించిన వారినే లెక్కలోకి తీసుకుంటున్నారని, ఇల్లు లేదా ఆసుపత్రి పార్కింగ్ ప్రదేశాల్లో చనిపోతున్న వారిని కరోనా మరణాల కింద పరిగణించట్లేదని పేర్కొంది. ‘‘చాలా డెత్ సర్టిఫికెట్లలో ఊపిరితిత్తుల సమస్య లేదా గుండె జబ్బు సమస్యతో చనిపోయారని పేర్కొంటున్నారు. కరోనా బాధితులు చనిపోతే వారికి డెత్ సర్టిఫికెట్లు జారీ చేసే విషయంలో సరైన విధానాలంటూ లేవా? దానికి ఏవైనా మార్గదర్శకాలున్నాయా’’ అంటూ కేంద్రానికి సుప్రీం కోర్టు నోటీసులిచ్చింది. దీనిపైనే కేంద్రం అఫిడవిట్ ను దాఖలు చేసింది.