ఇండో-పాక్ సరిహద్దుల గుండా భారత్కు ఖలిస్తానీ ఉగ్రవాదులు పెద్ద ఎత్తున ఆయుధాలు, పేలుడు పదార్థాలను పంపిస్తున్నారనే సమాచారంతో రాజస్థాన్, పంజాబ్లలో అలర్ట్ ప్రకటించారు. ఫిబ్రవరి 20న జరగనున్న పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు భారత్కు పెద్ద ఎత్తున ఆయుధాలు, పేలుడు పదార్థాలను అక్రమంగా తరలిస్తున్నట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరిక జారీచేశాయి.
ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారం ప్రకారం.. పంజాబ్లో మాటువేసిన ఉగ్రవాదులకు ఈ సరుకు సరఫరా అవుతోంది. పంజాబ్లో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీఎస్ఎఫ్ అప్రమత్తంగా ఉన్నందున రాజస్థాన్ సరిహద్దుల గుండా ఈ సరుకును అక్రమంగా రవాణా జరుగుతోంది. దీంతో అక్కడి అధికారులను, పోలీసులను నిఘా వర్గాలు అప్రమత్తం చేశాయి. అక్కడి నుంచి పంజాబ్లోని అబోహర్, భటిండాలో ఉగ్రవాదులకు ఓ వ్యక్తి ఆయుధాలు, పేలుడు పదార్థాలను సరఫరా చేస్తున్నట్టు ఆధారాలున్నాయి. దీంతో రాజస్థాన్, పంజాబ్ నిఘా వర్గాలకు ఈ సమాచారాన్ని తెలియజేశాయి. రెండు రాష్ట్రాల పోలీసులు అప్రమత్తంగా ఉండాలని ఇంటెలిజెన్స్ తమ నివేదికలో తెలిపింది.