Tuesday, November 26, 2024

Advice – అమ్మాయిలూ ఆ కోరికలను అణచుకోవాలి …

కౌమార దశలో ఉన్న అమ్మాయిలు తమ లైంగిక వాంఛలను అణచుకోవాలంటూ కోల్‌కతా హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. తీర్పులోని ప్రతి కాపీ అభ్యంతరకరంగా ఉన్నాయని వ్యాఖ్యానించింది. ఇలాంటి తీర్పులు రాయడం తీవ్రమైన తప్పిదమని పేర్కొన్నది. ఈ తీర్పు రాసిన న్యాయవాదులు కీలకమైన న్యాయ సూత్రాలను పరిగణనలోకి తీసుకోలేదని విమర్శించింది. గౌరవ హోదాలో ఉన్న న్యాయవాదులు ఇలాంటి తీర్పులలో తమ సొంత అభిప్రాయాలను చొప్పించడం సబబు కాదని సూచించింది.

14 ఏళ్ల బాలిక‌పై లైంగిక దాడి..
పశ్చిమబెంగాల్‌లో ఓ యువకుడు 14 ఏళ్ల బాలికను కిడ్నాప్‌ చేసి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ కేసులో విచారణ జరిపిన ట్రయల్‌ కోర్టు నిందితుడికి 20 ఏళ్ల జైలుశిక్ష విధించింది. దాంతో నిందితుడు ట్రయల్‌ కోర్టు తీర్పును కలకత్తా హైకోర్టులో అప్పీల్‌ చేశాడు. గత ఏడాది అక్టోబర్‌లో ఈ కేసులో జస్టిస్‌ చిత్తరంజన్‌ దాస్‌, జస్టిస్‌ పార్థసారథి సేన్‌ల నేతృత్వంలోని హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ విస్మయపరిచే తీర్పు చెప్పింది. కౌమార దశలో ఉన్న బాలికలు తమ లైంగిక వాంఛలను అదుపులో పెట్టుకోవాలని వ్యాఖ్యానించింది. ఆ రెండు నిమిషాల సుఖం కోసం బాలికలు పరాజితులుగా మిగిలిపోకూడదని ఉచిత సలహా ఇచ్చింది. అంతేగాక నిందితుడికి ట్రయల్‌ కోర్టు విధించిన 20 ఏళ్ల జైలుశిక్షను రద్దు చేసింది.

హైకోర్టు తీర్పును స‌వాల్ చేస్తూ..
ఈ కేసును గత డిసెంబర్‌ 8న సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించింది. హైకోర్టు తీర్పును సవాల్‌ చేసే ఉద్దేశం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందా.. లేదా..? తెలియజేయాలని పశ్చిమబెంగాల్‌ సర్కారుకు నోటీసులు జారీ చేసింది. ఈ క్రమంలో బెంగాల్‌ సర్కారు హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్‌ చేసింది. జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌, జస్టిస్‌ అభయ్‌ ఎస్‌ ఓకా నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం ఆ పిటిషన్‌పై విచారణకు స్వీకరించి, పైవిధంగా హైకోర్టు తీర్పుపై తన అభ్యంతరాన్ని వెల్లడించింది. ఈ కేసులో తదుపరి విచారణ జనవరి 12న జరుగనున్నది.

Advertisement

తాజా వార్తలు

Advertisement