సమాజ్ వాదీ పార్టీ సీనియర్ నేత బలరాం యాదవ్ భార్య కన్నుమూశారు. ఆమెకి సంతాపం తెలిపేందుకు ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ అజంగఢ్ వచ్చారు.ఆమెకి నివాళులర్పించిన అనతరం ఆయన రాజకీయాలపై మాట్లాడారు.. వచ్చే ఏడాది జరిగే సార్వత్రిక ఎన్నికల్లో సమాజ్ వాదీ పార్టీ నేతృత్వంలోని కూటమి మొత్తం 80 లోక్ సభ స్థానాల్లో పోటీ చేస్తుందన్నారు. రాష్ట్రీయ లోక్ దళ్, సుహెల్దేవ్ భారతీయ సమాజ్ పార్టీ (ఎస్బీఎస్పీ), మహాన్ దళ్, అప్నాదళ్ (కే), జన్వాది పార్టీలతో కలిసి ఎస్పీ 2022 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసింది. ఆ తర్వాత ఎస్బీఎస్పీ, మహాన్ దళ్ విడిపోయాయి. అయితే, బీజేపీని ఓడించడానికి కొత్త ఫ్రంట్ ఏర్పాటుపై తాను ఆశాభావంతో ఉన్నానని చెప్పారు.
బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, పశ్చిమ బెంగాల్ మమతా బెనర్జీ, తెలంగాణ సీఎం కే.చంద్రశేఖర్ రావు (కేసీఆర్) పేర్లను కొత్త ఫ్రంట్ సంభావ్య ముఖాలుగా ఎస్పీ చీఫ్ తీసుకున్నారు. అయితే, 2024 ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ ఒంటరిగా పోటీ చేస్తుందని మమతా బెనర్జీ ప్రకటించిన కొద్ది రోజులకే అఖిలేష్ యాదవ్ ఈ ప్రకటన చేయడం గమనార్హం.కాంగ్రెస్ తో పొత్తు ఉండబోదని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ ‘బుల్డోజర్ పాలసీ’పై మండిపడ్డారు. దేశాన్ని రాజ్యాంగం ప్రకారం నడపాలనీ, బుల్డోజర్ విధానం ద్వారా కాదని హితవుపలికారు. కుల గణన చేపట్టాలనే తన డిమాండ్ ను కూడా అఖిలేష్ యాదవ్ పునరుద్ఘాటించారు. 2024లో బీజేపీకి గుణపాఠం చెప్పాలని యువతకు పిలుపునిచ్చారు. యూపీలో ఎస్పీ ప్రభుత్వం ఉండి ఉంటే ఆజంగఢ్ లో అంతర్జాతీయ మ్యాచ్ జరిగేదని చెప్పారు. ఆజంగఢ్ లోని అంతర్జాతీయ విమానాశ్రయం గురించి ప్రభుత్వం గొప్పగా మాట్లాడుతోంది, కానీ బడ్జెట్లో దాని అభివృద్ధికి కేటాయించిన నిధుల గురించి ప్రస్తావించలేదంటూ పేర్కొన్నారు.