నట సింహం నందమూరి బాలకృష్ణ నటించిన తాజా సినిమా ‘అఖండ’ కలెక్షన్ల రికార్డులు బద్దలు కొడుతోంది. ‘అఖండ’గా బాక్సాఫీస్ వద్ద బాలయ్య తన విశ్వ రూపాన్ని చూపిస్తున్నారు. అఖండ మూవీతో తన కెరీర్ లోనే తొలిసారిగా వంద కోట్ల క్లబ్ లోకి చేరారు. డిసెంబర్ 2న విడుదలైన అఖండ 10 రోజుల్లోనే రూ.100 కోట్ల గ్రాస్ మార్క్‌ను అందుకుని ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యానికి గురి చేసింది.
మాస్ డైరెక్టర్ బోయపాటి, బాలకృష్ణ కాంబోలో వచ్చిన మూడో సినిమా ఇది. విడుదలైన మొదటి ఆట నుంచే అఖండకు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. దీంతో కలెక్షన్ల సునామీ సృష్టించింది. పది రోజుల్లోనే వంద కోట్ల రూపాయల వసూళ్లను రాబట్టింది. నైజాంలో రూ.16.50 కోట్లు, సీడెడ్ లో రూ.12.50 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ.5.10 కోట్లు, గుంటూరులో రూ.3.96 కోట్లు, తూర్పు గోదావరిలో రూ.3.39 కోట్లు, కృష్ణాలో రూ.2.99 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ.2.80 కోట్లు, నెల్లూరులో రూ.2.15 కోట్ల వసూళ్లు రాబట్టింది. తెలుగు రాష్ట్రాల్లో కలిపి మొత్తంగా రూ.49.34 కోట్ల షేర్ వచ్చినట్టు తెలుస్తోంది. ఇక, కర్ణాటకతో పాటు మిగతా రాష్ట్రాలు, ఓవర్సీస్ లో కలిపితే ఈ పది రోజుల్లో రూ.9.35 కోట్లు వచ్చాయి. మొత్తంగా రూ.58.74 కోట్ల షేర్ వచ్చింది. గ్రాస్ వసూళ్లు రూ.100 కోట్ల మార్కును దాటాయని అంటున్నారు.
ఇప్పటి వరకు బాలయ్య కెరీర్లో ఎక్కువ గ్రాస్‌ను కలెక్ట్ చేసిన సినిమాగా గౌతమీ పుత్ర శాతకర్ణి ఉంది. అయితే, తొలి వారంలోనే ఆ సినిమా కలెక్షన్లను అఖండ దాటేసి ఇప్పుడు వంద కోట్ల గ్రాస్ మార్క్‌ను టచ్ చేసింది. తొలిసారి బాలయ్య 100 కోట్ల క్లబ్ లో చేరడంతో ఆయన ఫ్యాన్స్ పుల్ ఖుషి అవుతున్నారు.