Monday, November 18, 2024

Airlines: తాగి ఫ్లైట్ ఎక్కొద్దు, డ్రంకెన్ డ్రైవ్ ఉంటది – సిబ్బందికి డీజీసీఎ ఫుల్ కండిషన్స్

ఎయిర్ లైన్స్ లో జాబ్ చేసే వారికి ఫుల్ కండిషన్స్ పెట్టింది డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA). విమానం రన్ వేపైకి చేరడానికి 12 గంటలలోపు క్యాబిన్ సిబ్బంది, పైలట్లు, మెయింటెనెన్స్ సిబ్బందితో సహా ఎవరూ ఆల్కహాల్ తీసుకోవద్దని ఆదేశించింది. అన్ని విమానయాన సంస్థలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. దీనికోసం ముందుగా డాక్టర్లు, అత్యవసర వైద్య సాంకేతిక నిపుణులను ఏర్పాటు చేసుకోవాలిని తెలిపింది. రక్తంలో ఆల్కహాల్ స్థాయిలను తెలుసుకునేందుకు బ్రీత్ ఎనలైజర్ పరీక్షలు చేయాలని ఆదేశించింది. విమానం వచ్చిన తర్వాత విమానంలోని సిబ్బందికి కూడా పోస్ట్-ఫ్లైట్ బ్రీత్ ఎనలైజర్ పరీక్ష నిర్వహించాలని DGCA తెలిపింది. సురక్షితమైన విమాన ప్రయాణానికి బ్లడ్ ఆల్కహాల్ స్థాయి ‘జీరో’ లెవల్ లో ఉండాలని, దీన్ని అంతర్జాతీయ పౌర విమానయాన సంస్థ  సిఫార్సు చేస్తున్నట్టు డీజీసీఏ తెలిపింది.  

డ్యూటీ షెడ్యూల్ అయిన ఆపరేటర్లందరికీ, ప్రతి ఫ్లైట్ క్రూ సభ్యుడు, క్యాబిన్ సిబ్బంది విమానాశ్రయంలో ప్రీ-ఫ్లైట్ బ్రీత్-ఎనలైజర్ పరీక్షకు లోబడి ఉండాలని సూచించింది. ఒక క్రూ సభ్యుడు ప్రీ-ఫ్లైట్ బ్రీత్ ఎనలైజర్ పరీక్ష చేయించుకోకుండానే విమానాన్ని నడుపుతున్నట్లయితే.. సంబంధిత ఎయిర్‌లైన్ చీఫ్ ఆఫ్ ఆపరేషన్స్ ల్యాండింగ్ అయిన వెంటనే వారిని ఆఫ్-రోస్టర్ చేసినట్టు నిర్ధారిస్తారని వెల్లడించింది. అదేవిధంగా భారతదేశం వెలుపల ఉన్న ప్రదేశాల నుంచి బయలుదేరే అన్ని షెడ్యూల్డ్ విమానాల కోసం, దేశంలోని మొదటి పోర్ట్ ఆఫ్ ల్యాండింగ్ వద్ద ప్రతి ఫ్లైట్ సిబ్బంది, క్యాబిన్ సిబ్బంది పోస్ట్-ఫ్లైట్ బ్రీత్-ఎనలైజర్ పరీక్ష చేయనున్నట్టు తెలిపింది. కొత్త నిబంధనల ప్రకారం, అన్ని బ్రీత్-ఎనలైజర్ పరీక్షల రిపోర్టరులను 24 గంటల్లోగా నివేదించాలని ఆదేశాలు జారీ చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement