ప్రకాశం జిల్లాలోని ఒంగోలులో రైతులకు వాయు గుండం భయం పట్టుకుంది. గత వారం కురిసిన వర్షాలతో పంటలకు లాభ, నష్టాలు చవిచూశాయి. కొన్నింటికి ఉపయుక్తం కాగా, మరి కొన్నింటికి నష్టమని రైతులు చెప్పారు. పలు ప్రాంతాల్లో పంటలు ఉరకేసే ప్రమాదం ఉందని ఆందోళన చెందారు. ఈ నేపథ్యంలో మళ్లీ ఇప్పుడు ఈశాన్య రుతుపవనాలకు తోడు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో జిల్లాలో బుధవారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో రైతుల్లో మరింత ఆందోళన వ్యక్తమవుతోంది. గురువారం ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. ఇలాగే ఉండి, భారీ వర్షాలు కురిస్తే పంటలకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రధాన రహదారులపై నీరు చేరడంతో వాహనాల రాకపోకలకు ఆటంకం ఏర్పడింది. రోడ్ల పై వరదనీరు చేరడంతో స్థానికులు అవస్థలు పడుతున్నారు. తీర ప్రాంతంలో గాలుల వేగం పెరగడంతో చలితీవ్రత ఎక్కువైంది. గంట గంటకూ గాలుల తీవ్రత పెరగడంతో తీర ప్రాంత ప్రజల్లో ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. నాగులుప్పలపాడులో కురిసిన వర్షంతో అమరావతి మహా పాదయాత్ర నిర్వాహకులను ఇబ్బందులకు గురి చేసింది. నాగులుప్పలపాడులో బస చేసిన రైతుల శిబిరంలో టెంట్లు వర్షానికి తడిసిపోయాయి. భారీ వర్షానికి జిల్లాలోని పలు ప్రాంతాల్లో రహదారులు జలమయమయ్యాయి.
జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి : కలెక్టర్
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారుతున్న నేపథ్యంలో జిల్లాలో యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్‌మోహన్‌రెడ్డి తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం నుంచి అత్యవసరంగా వీడియో సమావేశం ద్వారా మాట్లాడిన అనంతరం కలెక్టర్ అధికారులతో సమీక్షించారు. జిల్లా కేంద్రంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని, 24 గంటల పాటు పని చేసేలా అవసరమైన సిబ్బందిని నియమించామన్నారు. అధిక వర్షాలు కురిసే అవకాశమున్నందున జాగ్రత్త చర్యలు తీసుకోవాలని చెప్పారు. జిల్లాలో అన్ని శాఖల అధికారులను సమన్వయం చేయాలని సూచించారు. భారీ వర్షాల హెచ్చరికతో ఎలాంటి విపత్తు వచ్చినా సమర్థంగా ఎదుర్కొనడానికి అన్ని విధాలా సిద్ధంగా ఉన్నామని జిల్లా కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ రాష్ట్ర ముఖ్యమంత్రికి తెలిపారు. జిల్లాలో 27 మండలాల్లో వర్షం కురుస్తుందన్నారు. 11 తీర ప్రాంత మండలాలు ఉండగా అందులో 40 గ్రామాలు వర్షాలకు ప్రభావితమయ్యే అవకాశముందన్నారు. విపత్తు నిర్వహణ చట్టం కింద ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టామన్నారు. ఆ గ్రామాలు ముంపునకు గురైతే తక్షణ చర్యలు, పునరావాస కేంద్రాల ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నామని సీఎం కు ఆయన వివరించారు. నియోజకవర్గ స్థాయి అధికారులను ఆయా మండలాలకు ప్రత్యేక అధికారులుగా నియమించామని తెలిపారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడకుండా సి.పి.డి.సి.ఎల్. అధికారులకు పలు సూచనలు చేశామన్నారు. ఆర్.అండ్.బి, ఆర్‌డబ్ల్యుఎస్, వివిధ అనుబంధ శాఖలకు పలు ఆదేశాలు జారీ చేశామన్నారు. లోతట్టు గ్రామాలలో ప్రజలకు సహాయక చర్యలు చేపట్టేలా ఇప్పటికే టోల్‌ఫ్రీ నెంబరు ఏర్పాటు చేశామన్నారు. 25 వేల మంది మత్స్యకారులు ఉండగా సముద్రంలోకి వెళ్లకుండా వారిని అప్రమత్తం చేశామని తెలిపారు. మెరైన్ పోలీసులకు పలు సూచనలు చేశామని, ఎస్.డి.ఆర్.ఎఫ్.కి సమాచారం అందించామన్నారు. భారీ వర్షాలతో ఏనష్టం జరిగినా వెంటనే గుర్తించి సహాయక చర్యలు తీసుకునేలా సచివాలయాల సిబ్బందిని కూడా అప్రమత్తం చేశామని సీఎం దృష్టికి కలెక్టర్ తీసుకువెళ్లారు. సమావేశంలో జిల్లా నుంచి జిల్లా సంయుక్త జె. వెంకట మురళి, డి.ఆర్.ఓ.ఎస్. సరళావందనం, తదితరులు పాల్గొన్నారు.