తీర్థ్ దర్శన్ యోజన కార్యక్రమాన్ని ప్రారంభించారు సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్. ఈ యాత్రలో 32 మంది బృందం వెళుతోంది. కాగా వీరిలో 24 మంది పురుషులు, ఎనిమిది మంది మహిళలు వున్నారు. ఈ కార్యక్రమంలో తొలి దశ కింద మధ్యప్రదేశ్‌కు చెందిన సీనియర్ సిటిజన్లు రాష్ట్రంలోని పలు విమానాశ్రయాల నుంచి ఈ ఏడాది జూలై వరకు పలు బ్యాచ్‌లలో ప్రయాణించనున్నారు. ఈ సందర్భంగా 72 ఏళ్ల రామ్ సింగ్ కుష్వాహా జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. గాలిలో ఎగరాలనేది ప్రతి ఒక్కరి కల అన్నారు. ప్రతి ఒక్కరూ తన జీవితంలో ఒక్కసారైనా విమానంలో ప్రయాణించాలని కోరుకుంటారు. ఇప్పుడు మా కల నెరవేరుతోందన్నారు. ఇక తాను జీవితంలో తొలిసారి రాష్ట్రం దాటి వెళ్తున్నానని రాందాస్ అనే ప్రయాణీకుడు అన్నాడు. కాగా సీఎం శివరాజ్ సింగ్ కూడా ఉద్వేగానికి గురయ్యారు. ఈ రోజు తన కల సాకారమైందని.. తన తల్లిదండ్రుల వంటి వృద్ధులను విమానంలో తీర్ధయాత్రలకు పంపుతున్నానన్నారు.
2012లో బీజేపీ హయాంలో ముఖ్యమంత్రి తీర్ధ్ దర్శన్ యోజన పథకాన్ని ప్రారంభించారు. ప్రత్యేక రైళ్ల ద్వారా వృద్ధులను ఉచితంగా తీర్ధయాత్రలకు పంపుతున్నారు. అయితే యాత్రికులను విమానం ద్వారా పంపడం మాత్రం ఇదే తొలిసారి. ఇప్పటి వరకు 7.82 లక్షల మంది సీనియర్ సిటిజన్లు ఈ తీర్థయాత్ర పథకం కింద ప్రయోజనం పొందారు. మధ్యప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు ఈ ఏడాది చివరిలో జరగనున్న సంగతి తెలిసిందే. దీంతో అధికార బీజేపీ ప్రభుత్వం కొత్త పథకాల ద్వారా వివిధ వర్గాల పౌరులను తనవైపు తిప్పుకోవడానికి ప్రయత్నిస్తోంది. కాగా అటు ఆయా రాష్ట్రాల్లో అధికారంలో వున్న పాలక పక్షాలు కూడా ఆకర్షణీయమైన పథకాలతో ప్రజలను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. దీనిలో భాగంగా మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఓ వినూత్న పథకానికి శ్రీకారం చుట్టింది. యాత్రికులకు విమాన సౌకర్యాన్ని అందించిన తొలి రాష్ట్రంగా మధ్యప్రదేశ్ నిలిచింది. ఈ రోజు భోపాల్ నుంచి ప్రయాగ్ రాజ్ తీర్ధయాత్రకు బయల్దేరిన 32 మంది వృద్ధులకు విమాన సౌకర్యాన్ని అందించింది.