ఎయిరిండియా విమానంలో ఇవ్వాల రాత్రి (సోమవారం) సాంకేతిక లోపం తలెత్తింది. కేరళ రాష్ట్రం కన్నూర్ విమానాశ్రయంలో ఈ సమస్య తలెత్తింది. విమానాశ్రయం రన్వే నుంచి గాల్లోకి ఎగిరిన కొద్ది సేపటికే పైలట్ సమస్యను గుర్తించాడు. దీంతో తిరిగి కన్నూర్ ఎయిర్పోర్టుకే తీసుకొచ్చి అత్యవసరంగా ల్యాండ్ చేశాడు.
అయితే.. కోజికోడ్-కన్నూరు-ఢిల్లీ విమానం కన్నూర్ నుంచి బయలుదేరిన 10 నిమిషాల్లోనే తిరిగి రావడం, ఎమర్జెన్సీ ల్యాండింగ్ కావడంపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ అత్యవసర ప్రయాణాల పరిస్థితి ఏంటని నిలదీస్తున్నారు. ఈ క్రమంలో తాము ప్రత్యామ్నాయ విమానాన్ని అందించలేమని ఎయిరిండియా ప్రకటించడంతో వారు నిరసనకు దిగారు.