భారత్ బయోటెక్ కంపెనీ కొవాగ్జిన్ కరోనా టీకా ట్రయల్స్ పిల్లలపై ప్రారంభమయ్యాయి. రెండు నుంచి 18 ఏళ్లలోపు వారిలో కొవాగ్జిన్ టీకా ప్రభావం ఎలా ఉండనుంది అన్నదానిపై ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రి ట్రయల్స్‌కు కసరత్తు మొదలైంది. ఇప్పటి వరకు 18 ఏళ్లు నిండిన వారికి మాత్రమే వ్యాక్సిన్ ఇస్తుండగా, ఎయిమ్స్‌లో 12-18 ఏళ్ల మధ్య వారికి ఇప్పటికే ట్రయల్స్ ప్రారంభమయ్యాయి. ఇప్పుడు 6 నుంచి 12 ఏళ్ల మధ్య వయసున్న చిన్నారులపై ట్రయల్స్‌కు సమాయత్తం అవుతున్నారు. ఇందులో భాగంగా మంగళవారం బాల వలంటీర్ల ఎంపిక ప్రారంభం కానున్నట్టు ఎయిమ్స్‌కు చెందిన సెంటర్ ఫర్ కమ్యూనికేట్ మెడిసిన్ ప్రొఫెసర్ డాక్టర్ సంజయ్ రాయ్ తెలిపారు. కొద్దిరోజుల కిందటే పాట్నాలోని ఎయిమ్స్‌లో మొదలుపెట్టిన ట్రయల్స్‌ను ప్రస్తుతం ఢిల్లీ ఎయిమ్స్‌లోనూ ప్రారంభించటానికి వీలుగా ఈ కసరత్తు ప్రారంభించారు.
మరోవైపు త్వరలోనే 2 నుంచి ఆరేళ్లలోపు చిన్నారులపైనా త్వరలోనే క్లినికల్ ట్రయల్స్ ప్రారంభం కానున్నాయి. ఇక, 2 నుంచి 18 ఏళ్ల వయసు వారిపై కొవాగ్జిన్ క్లినికల్ పరీక్షలకు భారత్ బయోటెక్‌కు అనుమతి ఇస్తూ డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఏ) గత నెల 12న ఆదేశాలు జారీ చేసింది. చిన్నారులను మూడు గ్రూపులుగా విభజించి టీకా పరీక్షలు నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా కండరానికి టీకా ఇస్తారు. రెండు డోసుల మధ్య 28 రోజుల వ్యవధిని పాటిస్తారు.
హైదరాబాద్ కంపెనీ భారత్ బయోటెక్ ఉత్పత్తి చేస్తున్న కొవాగ్జిన్ టీకాను ప్రస్తుతం 18 ఏండ్లు నిండినవారు, ఆ పైన వయసున్న వాళ్లకే ఇస్తున్న విషయం తెలిసిందే. దేశంలో కరోనా తొలి, రెండో వేవ్‌లలో పిల్లలపై అంతగా ప్రభావం పడలేదు. కానీ, కరోనా వైరస్‌లోగానీ, దానివ్యాప్తిలోగానీ మార్పులు వస్తే పిల్లలపై తీవ్ర ప్రభావం పడే ప్రమాదం లేకపోలేదని కేంద్రప్రభుత్వం గత వారం హెచ్చరించింది. అటువంటి పరిస్థితి వచ్చినా ఎదుర్కోవటానికి వీలుగా సిద్ధంగా ఉండాలని, పిల్లలకు అవసరమైన చికిత్సను, ఔషధాలను, వైద్యులను సమకూర్చుకోవాలని, దవాఖానాల్లో ఆ మేరకు ఏర్పాట్లు కూడా చేసుకోవాలని రాష్ట్రాలకు సూచించింది.