Friday, November 22, 2024

బ్లాక్ ఫంగస్ కు అదే కారణం: ఎయిమ్స్ డైరెక్టర్

దేశంలో ఓవైపు కరోనా విలయం కొనసాగుతుంటే.. మరోవైపు బ్లాక్ ఫంగస్ కలకలం రేపుతోంది. పలు రాష్ట్రాల్లో కరోనా బారినపడుతున్న వారిలో కొందరు కంటిచూపు కోల్పోతున్న ఉదంతాలు వెల్లడయ్యాయి. అందుకు కారణం బ్లాక్ ఫంగస్ అని గుర్తించారు. ఈ బ్లాక్ ఫంగస్ తో కొన్ని సందర్భాల్లో మరణాలు కూడా సంభవిస్తున్నాయి. మ్యూకోర్ మైకాసిస్ అని పిలిచే బ్లాక్ ఫంగస్ పై ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా స్పందించారు. కరోనా రోగుల్లో బ్లాక్ ఫంగస్ తీవ్రం కావడానికి ప్రధాన కారణం విచ్చలవిడిగా స్టెరాయిడ్లు వాడడమేనని అభిప్రాయపడ్డారు. అవసరంలేకున్నా స్టెరాయిడ్లు వినిగియోస్తుండడం బ్లాక్ ఫంగస్ ఉద్ధృతికి దోహదపడుతోందని వివరించారు. ఇది ముఖ భాగాలకు ప్రధానంగా సోకుతుందని, ముక్కు, కంటి వలయం, మెదడు వంటి భాగాలను ఇన్ఫెక్షన్ కు గురిచేస్తుందని వివరించారు. కొన్ని సందర్భాల్లో ఊపిరితిత్తులకు కూడా వ్యాపిస్తుందని వెల్లడించారు.

మధుమేహంతో బాధపడుతున్నవారిలో, కరోనా పాజిటివ్ వ్యక్తుల్లో ఈ ఫంగస్ తీవ్ర లక్షణాలు కలుగుజేస్తోందని తెలిపారు. దీన్ని నివారించాలంటే చికిత్సలో స్టెరాయిడ్ల దుర్వినియోగాన్ని నిలిపివేయాలని గులేరియా స్పష్టం చేశారు. ఎయిమ్స్​ లో ప్రస్తుతం ఈ వ్యాధి బారిన పడి 23 మంది చికిత్స పొందుతున్నారని తెలిపారు. వారిలో 20 మందికి ఇంకా కొవిడ్​ పాజిటివ్ ​గా ఉండగా.. మిగతా వారికి నెగెటివ్ ​గా తేలినట్లు చెప్పారు. పలు రాష్ట్రాల్లో 500 చొప్పున ఈ తరహా కేసులు వెలుగుచూశాయని గులేరియా చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement