– ఇంటర్నెట్ డెస్క్, ఆంధ్రప్రభ
‘రజాకార్ – ద సైలెంట్ జెనోసైడ్ ఆఫ్ హైదరాబాద్’ సినిమా పోస్టర్ని ఇవ్వాల (శనివారం) హైదరాబాద్‌లో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ తెలంగాణ మాజీ అధ్యక్షుడు,ఎంపీ బండి సంజయ్, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి, మహారాష్ట్ర మాజీ గవర్నర్ సి. విద్యాసాగర్ రావు వంటి సీనియర్ నేతలు పాల్గొన్నారు. ఈ సినిమాకు యాట సత్యనారాయణ రచన, దర్శకత్వం వహించారు. ఈ ‘సమర్‌వీర్ క్రియేషన్స్’ బ్యానర్‌పై బీజేపీ నేత గూడూరు నారాయణరావు నిర్మించారు. హైదరాబాద్ సంస్థానంలోని రజాకార్ల దురాగతాల గురించి బయటకు తెలియని పలు విషయాలను ఈ సినిమా కథలో చిత్రీకరించినట్టు తెలుస్తోంది.
ఈ సినిమాని తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ చేసేందుకు నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ.. ఈ సినిమా మత ఘర్షణల చరిత్ర కాదన్నారు. ఇది ఎవరిలో అసంతృప్తిని కలిగించడానికి రూపొందించబడింది కాదన్నారు. ఇక.. షేక్ బందగి, మక్దూమ్ మొయినుద్దీన్, జర్నలిస్ట్ షోయబుల్లా ఖాన్ వంటి ముఖ్యమైన ముస్లిం వ్యక్తుల పేర్లను ఈ సినిమాలో ప్రస్తావించినట్టు సమాచారం. అయితే.. సినిమా నిర్మాతలను బండి సంజయ్ అభినందించారు. ఆ తర్వాత ‘పాత బస్తీ ఫైల్స్’ (ఓల్డ్ సిటీ) తీయాలని నిర్మాతను కోరుతున్నట్టు చెప్పారు. ‘ది కాశ్మీర్ ఫైల్స్’ సినిమా నుండి ప్రేరణ పొందిన తర్వాత దర్శక-నిర్మాత ద్వయం రజాకార్లపై సినిమాని రూపొందించినట్టు తెలుస్తోంది.
కాగా, తెలంగాణలో అనేక దురాగతాలకు నిజాంలే కారణమని చిత్ర నిర్మాతలు పేర్కొంటుండగా, బండి సంజయ్ మాత్రం “కొందరు చార్మినార్, ఉస్మానియా హాస్పిటల్, ఉస్మానియా విశ్వవిద్యాలయాన్ని చూపించి నిజాం-రజాకార్ల పాలనను స్వర్ణ కాలంగా పేర్కొంటున్నారని మండిపడ్డారు. ఆ రాక్షసుడిని (చివరి నిజాం) మంచి నాగరికత గల వ్యక్తిగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని, ఓటు బ్యాంకు రాజకీయాల వల్ల వారు అసలు చరిత్ర చూపించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘సూడో సెక్యులర్’ వ్యక్తులు కొన్ని వర్గాలను కలవరపెట్టాలని కోరుకోవడం లేదని బండి అన్నారు.
అయితే.. ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే.. చార్మినార్‌ను 1591లో కుతుబ్ షాహీ రాజవంశానికి చెందిన సుల్తాన్ మహమ్మద్ కులీ కుతుబ్ షా నిర్మించగా, ఉస్మానియా హాస్పిటల్ (1919లో) నిర్మాణం జరిగింది. ఉస్మానియా యూనివర్సిటీ (1918లో) అసఫ్ జాహీ వంశ పాలకుల ద్వారా నిర్మించబడింది. కానీ, కుతుబ్ షాహీలకు రజాకార్లతో ఎలాంటి సంబంధం లేదని చరిత్రను పరిశీలిస్తే వెల్లడవుతోంది. ఇక.. సెప్టెంబరు 17వ తేదీని ‘తెలంగాణ విమోచన దినం’గా ప్రచారం చేసేందుకు బీజేపీ చేస్తున్న ప్రయత్నాన్ని కూడా ఈ కార్యక్రమంలో చాలాసార్లు ప్రస్తావించారు.
మరి రజాకార్లు ఎవరు?
నిజాం పాలనలో హైదరాబాద్ రాష్ట్రంలో జాతీయవాద పార్టీకి చెందిన పారామిలిటరీ వలంటీర్ దళాన్ని రజాకార్లుగా పిలుస్తారు. 1938లో మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ లీడర్ బహదూర్ యార్ జంగ్ ఏర్పాటు చేసిన వారే వీళ్లు. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన సమయంలో ఖాసిం రజ్వీ నాయకత్వంలో వీరి విస్తరణ జరిగింది. హైదరాబాదులో ముస్లింల పాలనను కొనసాగించడానికి, భారత్‌లో విలీనానికి వ్యతిరేకంగా వీరి ప్రతిఘటించి పోరాటం చేశారు. అయితే.. అప్పట్లో వారు హిందువులతో పాటు ముస్లింలను కూడా టార్గెట్ చేసుకుని దాడులు చేశారు.
అంతేకాకుండా ప్రజల్లో విప్లవాన్ని రగిలించేందుకు ప్రయత్నించిన కమ్యూనిస్టులతో వీరు పోరాటం చేసినట్టు చరిత్రలో పలు ఆధారాలున్నాయి. ఇక.. ‘ది కాశ్మీర్ ఫైల్స్’ ‘ది కేరళ స్టోరీ’ వంటి సినిమాల్లో ముస్లిం సమాజాన్ని ఓ బూచిగా, టెర్రరిస్టులుగా చిత్రీకరించారనే విమర్శులు వెల్లువెత్తాయి. ఇప్పుడు తెలంగాణలో రజాకార్లపై తీసిన సినిమాలోనూ అట్లాంటి మరో ప్రయత్నమే చేశారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా తెలంగాణ సమాజం చాలా చైతన్యవంతమైందని, పోరాటాల్లో ఆరితేరిన వారు కాబట్టి మంచి ఏది, చెడు ఏదన్న విషయాలను ఈజీగా గుర్తించగలరని చరిత్రకారులు చెబుతున్నారు. ఎవరో కావాలని మతం రంగు పులిమితే రెచ్చిపోయే తత్వం తెలంగాణ ప్రజలకు లేదని అంటున్నారు.