Saturday, November 23, 2024

TS | గోవధ నిషేధ చట్టం అమలు చేయాలి.. బక్రీద్​ సందర్భంగా వీహెచ్​పీ డిమాండ్​

హైదరాబాద్​ సిటీలో బక్రీద్‌కు సన్నాహాలు జరుగుతున్నాయి. రాష్ట్రంలో ముస్లింలు ఈ పండుగను ఘనంగా జరుపుకోవడానికి రెడీ అవుతున్నారు. ఈ సందర్భంగా బలి కోసం పశువులు, గొర్రెలను కొనుగోలు చేస్తుండడంతో పెద్ద ఎత్తున వ్యాపారం జరగనుంది. అయితే.. ఆవులను బలి ఇవ్వకుండా అడ్డుకోవాలని, తెలంగాణ ప్రభుత్వం గోసంరక్షణ చట్టాలను అమలు చేయాలని విశ్వ హిందూ పరిషత్​ (వీహెచ్​పీ) డిమాండ్​ చేస్తోంది. ఈ నెల14వ తేదీన ఇందిరాపార్క్ వద్ద మహాధర్నాకు వీహెచ్‌పీ గోసంరక్షణ విభాగం పిలుపునిచ్చింది.

– ఇంటర్నెట్​ డెస్క్​, ఆంధ్రప్రభ

బక్రీద్​ పండుగ సందర్భంగా ఎద్దు, ఒంటెలతో సహా పశువులను వ్యాపారులు విక్రయిస్తారు. పశువుల వ్యాపారులు, అయితే.. గోసంరక్షణ పేరుతో కొంతమంది విపరీత పోకడపోతున్నారు. దీంతో ఘర్షణ వాతావరణం నెలకొంటోంది. మతపరమైన ఉద్రిక్తతలు తలెత్తే అవకాశాలున్నాయి. తెలంగాణ గోవధ నిషేధ చట్టం, 1977లోని సెక్షన్ 6 ప్రకారం ఆవులు, బర్రెలు, ఎద్దులు, ఒంటెలు తదితర వాటిని వ్యవసాయ పనులకు మాత్రమే వినియోగించాలి. 14 ఏళ్లలోపు ఎద్దులు, గేదెలను వధించరాదని చట్టంలో పొందుపరిచారు.

- Advertisement -

కాగా, అన్ని నిబంధనలను తుంగలో తొక్కి రాష్ట్రంలో ఇలాంటి జంతు బలులు జరుగుతూనే ఉన్నాయని గోసంరక్షణ సంఘం ఆరోపిస్తోంది. ఇది బక్రీద్ సమయంలో మరింత ఎక్కువగా జరుగుతోందని వారు చెబుతున్నారు.  తమ డిమాండ్లపై రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుంటుందని తాము ఆశిస్తున్నామని గోసంరక్షకులు తెలిపారు.  

ఇక.. అక్రమ కబేళాలను మూసివేయాలని, పచ్చిక బయళ్లను, పశువుల మేతకు పనికొచ్చే భూములను ఆక్రమణలను నుంచి విముక్తి చేయాలని ఆ సంస్థ డిమాండ్ చేసింది. బోరబండ, నార్సింగిలోని పశు మార్కెట్లను కూడా మూసివేయాలని కోరింది. పండుగ సందర్భంగా పట్టుకున్న ఆవుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక సంరక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయాలని డిమాండ్​ చేస్తున్నారు.

కాగా, బక్రీద్ సందర్భంగా పోలీసులు కఠిన చర్యలు తీసుకోకపోతే తాము రంగంలోకి దిగాల్సి వస్తుందని గోసంరక్షకులు హెచ్చరిస్తున్నారు. అయితే.. ఈద్ అల్ అదాను శాంతియుతంగా నిర్వహించే ప్రయత్నంలో తాము పశువుల వ్యాపారులను కలుస్తామని తెలంగాణ పోలీసులు చెప్పారు. పశువులు నగరంలోకి అక్రమంగా ప్రవేశించకుండా నిరోధించేందుకు పెట్రోలింగ్‌, చెక్‌పోస్టుల ఏర్పాటుపై దృష్టి సారించామని, గోసంరక్షక బృందాలపై నిఘా ఉంచామని పోలీసులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement