గత ప్రభుత్వం అమలు చేసిన రైతు బంధు పథకంలో అక్రమాలు చోటు చేసుకున్నాయని అప్పట్లోనే కాంగ్రెస్ నాయకుల ఆరోపణ. రైతుబంధు పథకం బదులు రైతు భరోసా పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసింది. అయితే వాస్తవిక సాగు చేసే రైతులకు మాత్రమే ఈ పథకం వర్తింపుజేయాలని ప్రభుత్వం నిర్దేశించి. ఆ మేరకు పైలట్ ప్రోగ్రాం కింద ఐదు జిల్లాల్లో సాగుపై అధ్యయనం చేపట్టి పూర్తి చేశారు. ఇందులో అక్రమాలు బయటపడితే రాష్ట్రమంతటా ఈ సర్వే చేపట్టే అవకాశం ఉంది.
(ఖమ్మం ఉమ్మడి బ్యూరో-ప్రభ న్యూస్) తెలంగాణలోని రైతు భరోసా పథకం నిజమైన రైతులకు అందజేయడం కోసం సాగుపై అధ్యయనం ప్రభుత్వం చేపట్టింది. సాగు వివరాలు పక్కాగా నమోదు చేయడం కోసం పైలట్ ప్రోగ్రాం కింద ఐదు జిల్లాలను ఎంపిక చేసింది. రాష్ట్రంలో ఖమ్మం, సంగారెడ్డి, కామారెడ్డి, కరీంనగర్, హనుమకొండ జిల్లాల్లో సాగు అధ్యయనం చేపట్టింది. ఖమ్మం జిల్లాల్లో రెండు మండలాల్లో సర్వే కార్యక్రమాన్ని అధికారుల బృందం పూర్తి చేసింది. ఖమ్మం, నేలకొండపల్లి మండలాల్లో 53 వేల సర్వే నంబర్లలో సుమారు లక్ష ఎకరాల భూమిని సర్వే చేశారు. ఇందుకు సంబంధించి యాప్‌లో వాటి వివరాలను అధికారులు నమోదు చేశారు.
గత ప్రభుత్వ హయాంలో రైతుబంధు పథకం పక్కదారి పట్టిందని, సాగుకు పనికిరాని భూములకు, కొండలు, గుట్టలకు కూడా ఈ పథకం వర్తించిందని కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపణ. ప్రభుత్వం వద్ద ఉన్న రికార్డుల ప్రకారం కొన్ని ప్రత్యేక సర్వే నెంబర్లలో వ్యవసాయ అధికారులు, రెవెన్యూ శాఖ అధికారులు సంయుక్తంగా చేసిన సర్వే లో అక్రమాలు జరిగినట్టు బయటపడింది. రైతు బంధు స్థానంలో రైతు భరోసా పథకాన్ని అమలు చేయడానికి ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. సాగు భూముల వాస్తవిక పరిస్థితులను బట్టి రైతు భరోసా వర్తించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
తెలంగాణలో ఐదు జిల్లాల్లో పైల ట్ ప్రొగ్రామ్ కింద సర్వే చేసి సాగు వాస్తవిక వివరాలను సేకరించాలని ప్రభుత్వం ఆదేశించింది. సాగులో ఎన్ని ఎకరాలు ఉన్నాయి? ఏయే పంటలను రైతులు సాగు చేస్తున్నారు? సాగులో లేని ఎకరాలు ఎన్ని ఉన్నాయి? గతంలో సాగు చేయకపోవడానికి కారణం ఏమిటి? అనే వివరాలు సేకరించి యాప్‌లో నమోదు చేయాలని సూచించింది. ఈ మేరకు వ్యవసాయ శాఖ అధికారులు పూర్తి స్థాయిలో అధ్యయనం చేశారు. ఖమ్మం జిల్లా కలెక్టర్ స్వీయ పర్యవేక్షణలో అధికారులు వారం రోజుల పాటు సర్వే నిర్వహించారు. మొత్తం 435 బృందాలుగా ఏర్పడిన అధికారులు ప్రభుత్వం ప్రతిపాదించిన ప్రకారం 53 వేల సర్వే నెంబర్లలో సుమారు లక్ష ఎకరాలను పరిశీలించారు. ఖమ్మం జిల్లాలో ఏఓలు, ఏఈఓలు, గ్రామ కార్యదర్శులు, ఇతర పంచాయతీ సిబ్బందిని వినియోగించి అధికారులు సర్వే చేయించారు. జిల్లాలో ఖమ్మం రూరల్, నేలకొండపల్లి మండలాల్లో సర్వే పూర్తి చేశారు. వారు ఇచ్చే వివరాలను గ్రామాలు, మండలాల వారీగా తయారు చేశారు. వాటిని యాప్‌లో నమోదు చేశారు. అక్రమాలు జరిగాయో లేవో అనేది అధికారులు వెల్లడించలేదు.