కేంద్రం తీసుకొచ్చిన అగ్నిపథ్‌కు నిరసనగా ఇవ్వాల (సోమవారం) కొన్ని సంస్థలు భారత్ బంద్‌కు పిలుపునిచ్చాయి. దీంతో రైల్వే ప్రొటెక్షన్ ఫోర్ (ఆర్పీఎఫ్), గవర్నమెంట్ రైల్వే పోలీసుల (జీఆర్పీ) అప్రమత్తమయ్యారు. రైల్వే స్టేషన్లు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాల వద్ద బందోబస్త్ ఏర్పాటు చేశారు.
కేంద్ర ప్రభుత్వం త్రివిధ దళాల్లో చేపట్టనున్న నియామకాలను అగ్నిపథ్ స్కీము ద్వారానే చేపట్టనున్నట్టు ప్రకటించింది. దీంతో ఆర్మీ ఉద్యోగ అభ్యర్థులు దేశ వ్యాప్తంగా ఆందోళనలు చేపడుతున్నారు. అగ్నిపథ్‌ని వాపస్ తీసుకోవాలని, తక్కువ వయస్సుకే ఆర్మీ అభ్యర్థులను పరిమితం చేస్తే తమ భవిష్యత్ ఆగమైతుందని ఇప్పటికే పలు రకాల పరీక్షలు ఎదుర్కొన్న అభ్యర్థులు అంటున్నారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీరును నిరసిస్తూ దేశ వ్యప్తంగా ఆందోళనలు చేఏస్తున్నారు. అంతేకాకుండా పలు రాష్ట్రాల్లో ఈ ఆందోళనలు, నిరసనలు తీవ్ర రూపం దాల్చాయి. ఉత్తరప్రదేశ్, బీహార్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ జార్ఖండ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలతో పాటు తెలంగాణలో రైల్వే స్టేషన్లలో విధ్వంసం సృష్టించారు.
ఆందోళనకారుల తీరుపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకుంటున్నా ఎక్కడా తగ్గడం లేదు. ఆందోళనలను మరింత విస్తృతం చేస్తున్నారు. కాగా అందులో భాగంగా ఇవ్వాల (సోమవారం) దేశ వ్యాప్త బంద్‌కు ఆర్మీ ఉద్యోగ అభ్యర్థులు పిలుపునిచ్చారు. దీంతో పలు రాష్ట్రాలు ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నాయి. ప్రభుత్వ కార్యాలయాల వద్ద 144 సెక్షన్ విధించాయి. ప్రజలు, యువకులు, విద్యార్థులు గుమిగూడి కనిపించవద్దని, చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలుంటాయని ఆయా రాష్ట్రాల అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
బంద్ నేపథ్యంలో కొన్ని రాష్ట్రాలు స్కూళ్లకు సెలవులు ప్రకటించాయి. స్టూడెంట్స్ పాఠశాలలకు వచ్చి, ఆ తర్వాత ఇబ్బందులు ఎదుర్కోవడం ఎందుకన్న ఉద్దేశంతో పాటు వారి బాగోగులను దృష్టిలో పెట్టుకుని పాఠశాలలకు సెలవులు ప్రకటించినట్టు ఉన్నతాధికారులు తెలిపారు.
గతంలో జరిగిన హింసాత్మక ఘటనలను దృష్టిలో పెట్టుకుని పలు ప్రాంతాల్లో అధికారులు గట్టి భద్రతా చర్యలు చేపట్టారు. బీహార్‌లోని కైమూర్, భోజ్‌పూర్, బక్సర్, ఔరంగాబాద్, రోహ్తాస్, తూర్పు చంపారన్, పశ్చిమ చంపారన్, నమస్తిపూర్, నవాడా, బెగుసరాయ్, లఖిసరాయ్, సరన్, వైశాలి, ముజఫర్‌పూర్, దర్భంగా, మధుబని, గయా, ఖగారియా, జెహనాబాద్ వంటి ప్రాంతాల్లో ఆంక్షలు విధించడంతోపాటు ఇంటర్నెట్ సేవలను కూడా నిలిపివేశారు. భారత్ బంద్ ప్రకటన నేపథ్యంలో పంజాబ్‌లోని సున్నితమైన ప్రాంతాలు, సైనిక స్థావరాలు, కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ భద్రతను మరింత పెంచారు.
కేరళలో భారీగా బలగాల మోహరింపు..
ఇక.. తెలంగాణలో ఆకస్మాత్తుగా జరిగిన సికింద్రాబాద్ రైల్వే స్టషన్ ఘటనను దృష్టిలో పెట్టుకుని దక్షిణ భారత దేశంలోని పలు రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. కేరళలో అయితే అల్లర్లు జరగనున్నాయన్న ఇంటెలిజెన్స్ నివేదికల నేపథ్యంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ముందస్తుగా బలగాలను మోహరించారు. ఎటువంటి హింసకు తావులేకుండా చర్యలు చేపట్టినట్టు కేరళ పోలీసు అధికారులు వెల్లడించారు.