కరోనా వైరస్ వల్ల 50 ఏళ్ల లోపు వాళ్లే ఎక్కువ సంఖ్యలో చనిపోయినట్లు ఢిల్లీ ఎయిమ్స్ వైద్యులు పేర్కొన్నారు. ఇండియన్ జర్నల్ ఆఫ్ క్రిటికల్ కేర్ మెడిసిన్ లో స్టడీకి సంబంధించిన ఫలితాలను ప్రచురించారు. ఎయిమ్స్ డైరక్టర్ రణ్‌దీప్ గులేరియా, ట్రామా సెంటర్ చీఫ్ డాక్టర్ రాజేశ్ మల్హోత్రా ఆధ్వర్యంలో ఆ స్టడీ జరిగింది. ఈ ఏడాది ఏప్రిల్ 4వ తేదీ నుంచి జూలై 24వ తేదీ మధ్య నమోదు అయిన మరణాల ఆధారంగా ఈ విషయాన్ని వెల్లడించారు.
ఎయిమ్స్ వైద్యులు సర్వే నిర్వహించిన సమయంలో.. 654 మంది మధ్య వయసు రోగులను ఐసీయూలో అడ్మిట్ చేశారు. దాంట్లో 247 మంది చనిపోయారు. మృతులను పలు ఏజ్ గ్రూపులుగా విభజించారు. అయితే 18 నుంచి 50 ఏళ్ల వారిలో 42.1 శాతం మంది మరణించినట్లు గుర్తించారు. ఇక 51 నుంచి 65 ఏళ్లు ఉన్నవారిలో 34.8 శాతం చనిపోయారు. 65 ప్లస్ ఏజ్ గ్రూపులో మరణించిన వారి సంఖ్య 23.1 శాతంగా ఉంది. హై బీపీ, డయాబెటిస్, కిడ్నీ వ్యాధులు ఉన్నవాళ్లు ఎక్కువ ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇక జ్వరం, శ్వాస ఆడకపోవడం లాంటి స్వల్ప లక్షణాలతో కొందరు ఇబ్బందిపడ్డారు. పీడియాట్రిక్ గ్రూపులోనూ 46 మంది హాస్పిటల్‌లో అడ్మిట్ అయ్యారు. కరోనా వల్ల ఆ గ్రూపునకు చెందిన ఆరుగురు మృతిచెందారు. పీడియాట్రిక్ గ్రూపులో మరణాల సంఖ్య 13 శాతంగా ఉంది.
ఇది కూడా చదవండి: దేశంలో కొత్తగా 37వేల కరోనా కేసులు, 907 మరణాలు