కోజికోడ్ జిల్లాలో కేరళ సీఎం పినరయి విజయన్ కి వ్యతిరేకంగా మావోయిస్టుల పేరుతో పోస్టర్లు వెలిశాయి. సిల్వర్‌లైన్ రైల్వే ప్రాజెక్టుపై సీఎంను విమర్శిస్తూ చేతిరాతతో కూడిన కొన్ని మావోయిస్టు పోస్టర్లు కనిపించాయని పోలీసులు తెలిపారు. ప్రజలు వ్యతిరేకిస్తున్నప్పటికీ, సిల్వర్‌లైన్ సెమీ-హై స్పీడ్ రైల్వే కారిడార్ ప్రాజెక్టు చేపడుతూ.. కేరళ ప్రభుత్వం చట్టవిరుద్ధంగా వ్యవహరిస్తోందని పోస్టర్లలో విమర్శించారు. సిల్వర్‌లైన్ సెమీ హైస్పీడ్ రైల్వే కారిడార్‌ను వ్యతిరేకిస్తున్న ప్రజలకు సంఘీభావం ప్రకటించారు. కేరళలో అధికారంలో విజయన్ ప్రభుత్వాన్ని ప్రజలకు వ్యతిరేక ప్రభుత్వమని పోస్టర్లలో ఆరోపించారు. కేంద్రంలో ప్రధాని మోడీ అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాన్నే.. కేరళలోని అధికార ఎల్డీఎఫ్ అనుసరిస్తోందని పేర్కొన్నారు. కోజికోడ్ జిల్లాలోని తామరస్సేరి సమీపంలోని మట్టికున్ను ప్రాంతంలో మావోయిస్టు పోస్టర్లు కనిపించడంతో స్థానిక పోలీసులు, Kerala Thunderbolts, ఎలైట్ కమాండో ఫోర్స్.. ఆ సమీప ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. మావోయిస్టుల గురించి ఏదైనా సమాచారం దొరుకుతుందోమోనని ఆ ప్రాంతాలన్ని జల్లెడ పట్టారు. మేం పరిస్థితిని పర్యవేక్షిస్తున్నాం.. దర్యాప్తు ప్రారంభించాం ’అని కోజికోడ్ రూరల్ ఎస్పీ ఎ శ్రీనివాస్ పిటిఐకి తెలిపారు. మరిన్ని వివరాలు చెప్పేందుకు ఆయన నిరాకరించారు.
మావోయిస్టుల పేర్లతో వెలిసిన పోస్టర్లలో.. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలకు ప్రజలకు పిలుపునిచ్చారు. మట్టికున్ను వద్ద ఉన్న బస్టాప్, చుట్టుపక్కల 17 పోస్టర్లు కనిపించాయని పోలీసులు తెలిపారు. ఇక, కేరళ ప్రభుత్వం చేపట్టిన సిల్వర్‌లైన్ ప్రాజెక్టును విమర్శిస్తూ మావోయిస్టుల పేరుతో పోస్టర్లు కనిపించడం ఇదే తొలిసారి. సిల్వర్‌లైన్ సెమీ-హై స్పీడ్ రైల్వే కారిడార్ ప్రాజెక్టు విషయానికి వస్తే.. తిరువనంతపురం నుంచి కాసర్గోడ్ వరకు 530 కిలోమీటర్ల మేర సాగనుంది. ఇది భవిష్యత్తు తరాలకు ప్రయోజనకరంగా ఉంటుందని, ఆర్థికాభివృద్ధికి తోడ్పతుందని ప్రభుత్వం చెబుతోంది. ప్రతి సంవత్సరం 2.8 లక్షల టన్నుల కర్బన ఉద్గారాలను తగ్గించవచ్చని పేర్కొంది. సిల్వర్‌లైన్ ప్రాజెక్టు కొల్లాం, చెంగన్నూర్, కొట్టాయం, ఎర్నాకులం, త్రిసూర్, తిరుర్, కోజికోడ్, కన్నూర్‌లలో స్టాప్‌లు ఉండనున్నాయి. అయితే ప్రతిపక్షాలు ఈ ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ ఉద్యమాలు చేస్తున్నాయి.