కరోనా కేసులు పెరుగుతుండటంతో కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సినిమా థియేటర్లలో సీటింగ్ సామర్థ్యం 50 శాతానికి మించొద్దని ఆదేశించింది. ఈ నెల 7 నుంచి ఈ ఉత్తర్వులు అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది. సీటింగ్ కెపాసిటీని తగ్గించవద్దని కన్నడ సినీ ఇండస్ట్రీ నుంచి విజ్ఞప్తులు వచ్చినా సీఎం యడియూరప్ప పట్టించుకోలేదు. పలు జిల్లాల్లో పాఠశాలలు మూసివేశారు. పబ్బులు, రెస్టారెంట్లలోనూ ఆంక్షలు విధించారు.
అయితే కర్ణాటక ప్రభుత్వం మాట మార్చడానికి ముందు ‘వియ్ వాంట్ హండ్రెండ్ పర్సెంట్ ఆక్యుపెన్సీ’ అంటూ సోషల్ మీడియా వేదికగా కన్నడ స్టార్లు కోరారు. కోవిడ్ పరిస్థితుల నుంచి చిత్రపరిశ్రమ పూర్తిగా కోలుకోలేదు. ఈ సమయంలో థియేటర్స్‌లో సీటింగ్ సామర్థ్యాన్ని తగ్గించడం కరెక్ట్ కాదని ‘కేజీఎఫ్’ ఫేమ్ యశ్‌తో పాటు పలువురు కన్నడ సినీ ప్రముఖులు అభిప్రాయపడ్డారు.
కన్నడ స్టార్ హీరో పునీత్ రాజ్‌కుమార్ నటించిన భారీ చిత్రం ‘యువరత్న’ శుక్రవారమే రిలీజై, థియేటర్స్‌లో ఉంది. ఇలా హఠాత్తుగా సీటింగ్ సామర్థ్యాన్ని తగ్గించడం పట్ల పునీత్ ఫ్యాన్స్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇది ఇలా ఉండగా, శనివారం నాడు పునీత్ సైతం స్వయంగా వెళ్ళి, కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్పను కలిశారు. ఆ సమావేశం తరువాత ఈ నెల 7 వరకూ వంద శాతం సీటింగ్‌కి అనుమతిస్తూ, కర్ణాటక సర్కార్ కొత్త జీవో విడుదల చేయడం గమనార్హం.