పలమనేరు (రాయలసీమ ప్రభ న్యూస్ బ్యూరో): యూట్యూబ్‌లో నకిలీ నోట్లు తయారు చేయడం ఎలాగో నేర్చుకున్న 41 ఏళ్ల వ్యక్తి వాటిని చలామణి చేస్తూ పలమనేరు పోలీసులకు పట్టుపడ్డాడు. డీఎస్పీ సుధాకర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. చిత్తూరు జిల్లా వి కోట మండలం కొత్తూరు గ్రామానికి చెందిన ఎం గోపాల్ (41) టీ తయారు చేసి అమ్మేవాడు. అయితే మద్యం, బీడీల వంటి అలవాట్లు ఎక్కువ కావడంతో అడ్డదారిలో డబ్బులు సంపాదించాలనుకున్నాడు. గతంలో బెంగళూరులో ఒక ప్రింటింగ్ ప్రెస్ లో పనిచేసిన అనుభవంతో నకిలీ నోట్లు తయారు చేసి, మారిస్తే డబ్బులు ఎక్కువగా సంపాదించవచ్చనుకున్నాడు.
సుమారు 3 నెలల క్రితం యూ టూబ్ ద్వారా నకిలీ నోట్లు తయారు చేసే విధానాన్ని నేర్చుకున్నాడు. బెంగళూరులో ఒక కలర్ ప్రింటర్ ను తీసుకొచ్చి ఇంటిలోనే నెల రోజులుగా అప్పుడప్పుడూ 500/-, 200/-, 100/- రూపాయల ఒరిజినల్ నోట్లను పెట్టి నకిలీ నోట్లను ప్రింట్ చేయడం మొదలెట్టాడు. ఆ నకిలీ నోట్లపై ఉన్న సెక్యురిటీ త్రెడ్ కు గ్రీన్ కలర్ నెయిల్ పాలిష్ పూసిన తర్వాత వాటిని చూడటానికి ఒరిజినల్ నోట్లు లాగే ఉన్నందున, సంత, కూరగాయల అంగళ్ళ వద్ద మార్చవచ్చను కున్నాడు. సుమారు 15 రోజుల క్రితం ఇతను పలమనేరుకు వచ్చి గంగమ్మగుడి వీధిలోని కూరగాయల అంగళ్ళ వద్ద 500/- రూపాయల నోటు ఇచ్చి ఆ డబ్బులకు కూరగాయలు 50/- రూపాయలకు కొనుక్కొని మార్చేవాడు.
ఇవ్వాల (శనివారం ) ఉదయం కొన్ని 500/-, 200/-, 100/- రూపాయల నోట్లను వాళ్ళ ఇంట్లో ప్రింట్ తీసుకొని పలమనేరుకు వచ్చి కూరగాయల అంగడి వద్ద 200/- రూపాయల నకిలీ నోటును ఇచ్చి మారుస్తుండగా పట్టుబడ్డాడు. ఓ వ్యక్తి నకిలీ నోట్లు చలామణి చేస్తున్నాడని తెలియడంతో పలమనేరు అర్బన్ సిఐ చంద్రశేఖర్, ఎస్ ఐ సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో సిబ్బంది తో కలిసి గోపాల్ ను అదుపులో తీసుకుని విచారణ చేపట్టారు. పోలీసుల విచారణలో తాను చేస్తున్న నకిలీ నోట్ల వ్యాపారం గురించి మొత్తం చెప్పేశాడు.
నిందితుడు గోపాల్ వద్ద ఉన్న నకిలీ నోట్లను పరిశీలించగా 500/-, 200/-, 100/- రూపాయల నోట్లు రూ 7,500 విలువైనవి దొరికాయి. వీటికి అసలైన నోట్లకి ఉండాల్సిన సెక్యురిటీ మార్కులు ఏమీ లేవు. ఆ తర్వాత గోపాల్ ఇంటి వద్ద నకిలీ నోట్లను తయారు చేయడానికి ఉపయోగించిన కలర్ ప్రింటర్, కత్తెర, నెయిల్ పాలిష్, పేపర్లు, ఇంక్ బాటిళ్ళను స్వాధీన చేసుకున్నారు పోలీసులు. నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.