కొత్తగా పెళ్లి చేసుకున్న వరుడికి నవ వధువు ఊహించని షాక్ ఇచ్చింది. అత్తగారింటికి వచ్చిన ఆమె ఇంట్లోని నగదుతో ఉడాయించింది. ఇది తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలో జరిగింది. ఓ 40 ఏళ్ల వ్యక్తికి పెళ్లి చేసుకోవాలనే కోరిక కలిగింది. దీంతో అతని దోస్త్ సాయంతో మధ్యవర్తిని కలిసి తన పెళ్లి విషయాన్ని ప్రస్తావించాడు. సంబంధం కుదర్చడానికి తనకు రూ.లక్ష ఇవ్వాలని మధ్యవర్తి డిమాండ్ చేశాడు. అందుకు ఓకే చెప్పడంతో విజయవాడకు తీసుకువెళ్లాడు. అక్కడ ఓ అమ్మాయిని చూపించడంతో అక్కడే లాడ్జిలో పెళ్లి తతంగం ముగించారు.
ఆ తర్వాత పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు తెలంగాణలోని యాదగిరిగుట్టకు వచ్చి వ్రతం కూడా చేశారు. తర్వాత హైదరాబాద్‌లో గ్రాండ్‌గా షాపింగ్ చేశారు. ఈ షాపింగ్‌లో 3 తులాల బంగారు గొలుసు, రూ.40 వేల బట్టలు కొనుగోలు చేసి సొంతూరుకు చేరుకున్నారు. ఇంటికి వచ్చాక కొత్త పెళ్లి కూతురు బీరువాలో దుస్తులు సర్దుతున్నట్లు నటించింది. అందులోని రూ.2 లక్షలు, కొత్త బట్టలను తన బ్యాగ్ లో సర్దేసుకుంది. అప్పటికే తనతో పాటు వచ్చిన యువతి ఓ క్యాబ్ బుక్ చేయగా, ఆ నవ వధువు తనకు తల నొప్పిగా ఉందని ట్యాబ్లెట్ తీసుకురావాలని భర్తను బయటకు పంపింది. అతను అటు వెళ్లగానే వారిద్దరు కారులో జంపయ్యారు. ఇంటికి తిరిగి వచ్చిన భర్త జరిగిన మోసాన్ని గుర్తించి నెత్తినోరుకొట్టుకున్నాడు. పోలీసులకు కంప్లెయింట్ చేయడంతో ఈ విషయం కాస్త అందరికీ తెలిసింది. అయితే ఇది పెళ్లి పేరుతో మోసాలకు పాల్పడే ముఠా అయి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.