ప్రముఖ ఫొటో ఎడిటింగ్ సాఫ్ట్‌వేర్ అడోబ్ ఫొటోషాప్ గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలోనే కొత్త వెర్షన్ ఫ్రీగా అందివ్వబోతున్నట్టు ప్రకటించింది. అడోబ్ యూజర్ల కోసం త్వరలో ఫొటోషాప్ వెబ్ వెర్షన్ తీసుకొస్తోంది. ఇప్పటికే కంపెనీ వెబ్ వెర్షన్ ఫొటోషాప్ కోసం ఫ్రీ ట్రయల్స్ నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. సాధారణంగా అడోబ్ ఫొటోషాప్ యాక్సెస్ చేయాలంటే ప్రీమియం లైసెన్స్ డ్ సాఫ్ట్ వేర్ ఉండాలి.
కానీ, ఇప్పుడు తెస్తున్న కొత్త వెర్షన్‌తో ఈ అవసరం ఉండదు. ఫొటోషాప్ వినియోగదారుల కోసం ఉచితంగా వెబ్ వెర్షన్ అందించేందుకు అడోబ్ కంపెనీ ప్రయత్నాలు చేస్తోంది. అందులోభాగంగానే బ్రౌజర్ ఆధారిత ఫొటోషాప్ వెర్షన్ తీసుకొస్తున్నట్టు తెలిపింది కంపెనీ.
అయితే.. ప్రతి ఒక్కరికీ ఉచితంగా ఈ సర్వీసును అందించడానికి కంపెనీ ఆలోచిస్తున్నట్టు సమాచారం. అడోబ్ ఈ సేవను ‘freemium’ అని పిలవాలని యోచిస్తున్నట్లు ది వెర్జ్ నివేదిక పేర్కొంది. ఈ ఫొటోషాప్‌లోని కొన్ని ఫీచర్లు కొంత సమయం తర్వాత అందుబాటులో ఉండవు. ఫోటోషాప్ మొదట ఉచితంగా యాక్సెస్ చేసుకోవచ్చు.
మరిన్ని ఫీచర్లను యాక్సస్ చేసుకునేందుకు మెంబర్‌షిప్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇట్లా కొనుగోలు చేసిన వారికి కొన్ని ఫీచర్లను అదనంగా అందివ్వనున్నట్టు పేర్కొంది. ఎక్కువమంది యూజర్లకు ఈ సర్వీసును వినియోగించుకోవడానికి వెబ్ వెర్షన్ ఫొటోషాప్ అందుబాటులోకి తేనున్నట్టు అడోబ్ కంపెనీ తెలిపింది.
ఎక్కువ మంది యూజర్లు ఫొటోషాప్ వినియోగించుకోవడానికి అవకాశం కల్పిస్తున్నామని అడోబ్ డిజిటల్ ఇమేజింగ్ VP మరియా యాప్ అన్నారు. ఉచిత వెర్షన్‌లో యాడ్స్ ఉంటాయా లేదా అనేది ప్రస్తుతం క్లారిటీ లేదు. చాలా వెబ్ ఆధారిత ఫోటో ఎడిటింగ్ యాప్‌లు ఉచిత వెర్షన్ అందిస్తాయి. Adobe ప్రతి ఒక్కరికీ ఉచిత వెర్షన్ ఎప్పుడు అందించాలని యోచిస్తోందో ఇంకా వెల్లడించలేదు.
ప్రస్తుతానికి కెనడాలో ఈ వెబ్ వెర్షన్ ఫొటోషాప్ టెస్టింగ్ చేస్తోంది. అయితే ఇతర ప్రాంతాలకు సంబంధించిన లాంచ్ టైమ్‌లైన్ పై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ప్రస్తుతానికి, “ఫ్రీమియం” వెర్షన్ భారత్‌కు వస్తుందా లేదా అనేది కూడా కంపెనీ ప్రకటించలేదు. ఇప్పటికైతే భారత్‌లో 7 రోజుల ఫ్రీ ట్రయల్‌ని యూజర్స్ వాడుకోవచ్చు. ఆ తర్వాత నెలకు రూ. 1,675.60 చెల్లించాల్సి ఉంటుంది. ఈ సర్వీసును తక్కువ ధరకు పొందడానికి ఆఫర్లు కూడా ఉన్నాయి.