Sunday, November 17, 2024

విశాఖలో లంగరేసిన అదానీ, స్టీల్ ప్లాంట్​పై కన్ను.. ప్రైవేటీకరణకు రెడీ అంటున్న కేంద్రం

సిమెంట్‌ రంగంలో కొనుగోళ్లు పూర్తి చేసిన తదుపరి స్టిల్‌ ఇండస్ట్రీపై దృష్టి సారించనున్నారు. వచ్చే జనవరిలో విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రవేటీకరణకు కేంద్ర ప్రభుత్వం బిడ్స్‌ ఆహ్వానించనుంది. ఇందులో పాల్గొనాలని అదానీ గ్రూప్‌ నిర్ణయించుకున్నట్లు వార్తలు
వస్తున్నాయి. రాష్ట్రీయ ఇస్పత్‌ నిగమ్‌ లిమెటెడ్‌ పేరుతో ఉన్న విశాఖ ఉక్కును సొంతం చేసుకునేందుకు టాటా స్టీల్‌, జేఎస్‌డబ్ల్యూ, అర్సెలర్‌ మిట్టల్‌ నిప్పన్‌ స్టీల్‌కు అదానీ గ్రూప్‌ గట్టి పోటీ ఇవ్వాలని నిర్ణయించుకుందని సమాచారం. ఈ పోటీలో దూకుడుగా వ్యవహారించాలని అదానీ గ్రూప్‌ నిర్ణయించింది.

ప్రస్తుతం ఉన్న స్టీల్‌ కంపెనీలు చిన్న కంపెనీలను కొనుగోలు చేయడం ద్వారా విస్తరించాయి. సిమెంట్‌ కంపెనీలు అంబుజా, ఏసీసీ కొనుగోలులో అదానీ గ్రూప్‌ దూకుడుగా వ్యవహరించింది. ఈ కొనుగోలుతో దేశంలోనే రెండో అతి పెద్ద సిమెంట్‌ ఉత్పత్తిదారుగా అదానీ గ్రూప్‌ అవతరించింది. ఇప్పుడు విశాఖ స్టీల్‌ విషయంలోనూ ఇదే దూకుడు ప్రదర్శించాలని అదానీ గ్రూప్‌ నిర్ణయించిందని ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వర్గాలు వెల్లడించాయి.

ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్‌ కమిటీ వచ్చే జనవరిలో విశాఖ ఉక్కును వంద శాతం ప్రవేటీకరించేందుకు చర్యలు తీసుకోనుంది. విశాఖ ఉక్కు 24 వేల ఎకరాల్లో విస్తరించి ఉంది. దీని విలువను ప్రభుత్వం 1.5 లక్షల కోట్లుగా లెక్కించింది. విశాఖ ఉక్కు 7.3 మిలియన్‌ టన్నులు వార్షిక ఉత్పత్తి సామర్ధ్యం కలిగి ఉంది. కంపెనీలో 6 వేల మంది అధికారులు, 12 వేల మంది రెగ్యులర్‌ కార్మికులు, 20 వేల మంది కాంట్రాక్ట్‌ కార్మికులు పని చేస్తున్నారు. గంగవరం పోర్టుతో విశాఖ ఉక్కుకు లింక్‌ ఉంది. ఇక్కడ నుంచే కంపె నికి అవసరమైన బొగ్గు, ముడి ఇనుమును దిగుమతి చేసుకుంటుంది. ఉత్పత్తులను ఇక్కడి నుంచి మార్కెటింగ్‌ చేస్తోంది.

విశాఖ ఉక్కు 2011-15 వరకు లాభాల్లోనే నడించింది. ప్రభుత్వం విశాఖ ఉక్కుకు ఇనప గనులు కేటాయించకపోవడంతో బహిరంగ మార్కెట్‌లో అధిక ధరకు కొనాల్సి వస్తోంది. దీని వల్ల కంపెనీకి నష్టాలు వస్తున్నాయి. 2921లో కంపెనీకి 789 కోట్ల నష్టం వచ్చింది. ఆ సంవత్సరం 17,980 కోట్ల టర్నోవర్‌ సాధించింది. 2014-15లో 1421 కోట్లు నష్టం వచ్చింది. 2018-19 సంవత్సరంలో కంపెనీ 97 కోట్ల రూపాయల నికర లాభం ఆర్జించింది. విశాఖ ఉక్కు ప్రవేటీకరణకు వ్యతిరేకంగా విపక్షాలు, కార్మిక సంఘాలు ఆందోళనలు చేస్తున్నాయి. ఈ ఉక్కు కర్మాగారం కోసం ఆనాటి ఉమ్మడి ఆంధ్ర్రప్రదేశ్‌లో భారీ ఎత్తున ఉద్యమాలు జరిగాయి. గుజరాత్‌లోని అదానీ గ్రూప్‌ దక్షిణ కొరియా కంపెనీ పోస్కోతో సంయుక్తంగా 5 బిలియన్‌ డాలర్ల పెట్టుబడితో స్టీల్‌ ప్లాంట్‌ను ప్రారంభించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement