Tuesday, November 19, 2024

అంబానీని దాటేసిన అదానీ, 3నెలల్లో 1.57లక్షల కోట్లు.. మస్క్‌, బెజోస్‌, బిల్‌గేట్స్‌, బఫెట్‌ కంటే అధికం

భారత అపర కుబేరుడు, అదానీ గ్రూప్‌ చైర్మన్‌ గౌతమ్‌ అదానీ తన సంపాదనతో మరోసారి సంచలనం సృష్టించాడు. గత మూడు నెలల్లో ఆదాని ఆదాయం టెస్లాకు చెందిన ఎలాన్‌ మస్క్‌, అమెజాన్‌ అధినేత జెఫ్‌బెజోస్‌, బిల్‌గేట్స్‌, వారెన్‌ బఫెట్‌ల కంటే అత్యధికమని బ్లూమ్‌బర్గ్‌ బిలియనీర్స్‌ సూచీ వెల్లడించింది. ఆదానీ గత ఆర్థిక సంవత్సరం చివరి మూడు నెలల్లో 21.1 బిలియన్‌ డాలర్లు (రూ.1.57లక్షల కోట్లు) సంపదను ఆర్జించారు. ఈ కాలంలో మరో భారత వ్యాపార దిగ్గజం ముకేశ్‌ అంబానీ ఆర్జన 8.24బిలియన్‌ డాలర్లు (రూ.61,800కోట్లు) మాత్రమే అని బ్లూమ్‌బర్గ్‌ పేర్కొంది. ప్రస్తుతం ఆసియాలో అత్యంత ధనికుల జాబితాలో వీరిద్దరూ మొదటి రెండు స్థానాల్లో నిలిచారు.అయితే బ్లూమ్‌బర్గ్‌ బిలియనీర్స్‌ సూచీలోని టాప్‌-10లో వీరిద్దరు మినహాయిస్తే మిగిలినవారంతా అమెరికన్లే కావడం విశేషం. ముకేశ్‌ అంబానీ 98.2డాలర్లతో టాప్‌-10లో ఉండగా ఫ్రాన్స్‌కు చెందిన బెర్నార్డ్‌ ఆర్నాల్డ్‌ మూడోస్థానంలో నిలిచారు. అంబానీ తర్వాత స్థానంలో 97.6 బిలియన్‌ డాలర్లతో అదానీ నిలిచారు. కాగా 2022లో అదానీ నికర సంపద 27శాతం మేర వృద్ధి చెందింది.

అయితే ప్రపంచవ్యాప్తంగా ఎలాన్‌ మస్క్‌ 271 బిలియన్‌ డాలర్లతో ప్రథమస్థానంలో ఉన్నాడని బ్లూమ్‌బర్గ్‌ తెలిపింది. అయితే మస్క్‌ మూడు నెలల్లో 1.14బిలియన్‌ డాలర్లు మాత్రమే ఆర్జించారు. కాగా ఈ ఏడాదిలో ఇప్పటివరకు జెఫ్‌ బెజోస్‌ 4.3బిలియన్‌ డాలర్లు, బిల్‌గేట్స్‌ 4.48 బిలియన్‌ డాలర్లు నష్టపోయారు. బఫెట్‌ 18.7బిలియన్‌ డాలర్లను ఆర్జించి తన సంపదను 128బిలియన్‌ డాలర్లకు పెంచుకున్నారు. ఈ జాబితాలో భారతీయ వ్యాపార దిగ్గజాల్లో అజీమ్‌ ప్రేమ్‌జీ 34.4బిలియన్‌ డాలర్ల సంపదతో 36వ స్థానంలో, శివ్‌నాడర్‌ 28.9 బిలియన్‌ డాలర్లతో 46వ స్థానంలో, రాధాకిషన్‌ ధమానీ 20.7 బిలియన్‌ డాలర్లతో 75వ స్థానంలో, లక్ష్మీమిట్టల్‌ 20.2 డాలర్లతో 78వ స్థానంలో ఉన్నారు. ఫోర్బ్స్‌ రియల్‌ టైం బిలియనీర్ల జాబితా ప్రకారం అంబానీ, అదానీల నికర సంపద 100బిలియన్‌ డాలర్లను అధిగమించింది. వీరిమధ్య వ్యత్యాసం 300 మిలియన్‌ డాలర్లగా ఫోర్బ్స్‌ పేర్కొంది. ఈ ఏప్రిల్‌ 1వ తేదీనాటికి అదానీ సంపద 101.8బిలియన్‌ డాలర్లు, అంబానీ సంపద 100.5బిలియన్‌ డాలర్లుగా ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement