డిజిటల్ జర్నీలో భాగంగా అదానీ గ్రూప్ ఒకడుగు ముందుకు వేసింది.. తొలుత అదానీ వన్ యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ యాప్ ద్వారా కేవలం విమాన సర్వీసులను మాత్రమే పొందవచ్చు. విమానాల బుకింగ్, ఫ్లైట్ స్టేటస్, క్యాబ్ బుకింగ్, ఎయిర్పోర్ట్ లాంజ్ బుకింగ్ వంటి అనేక ఫెసిలిటీస్ యాప్ ద్వారా అందుబాటులోకి రానున్నాయి. అదానీ ఎయిర్‌పోర్ట్స్ కోసం దీన్ని ప్రారంభించినట్లు ఆ గ్రూప్ కన్స్యూమర్ బిజినెస్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్-చీఫ్ డిజిటల్ ఆఫీసర్ నితిన్ సేథి తెలిపారు.
ఇక.. ఈ యాప్ ద్వారా ప్రయాణికుల నుంచి వచ్చే ఫీడ్ బ్యాక్ ఆధారంగా జర్నీని మరింత ఈజీగా మార్చేందుకు కృషి చేయనున్నారు. ఇది ఆండ్రాయిడ్, ఐఓఎస్ వినియోగదారులకు అందుబాటులో ఉండనున్నది. డిసెంబర్ 20 నాటికి ఈ యాప్‌ను 1,000 మంది డౌన్లోడ్ చేసుకున్నారు. గూగుల్ ప్లే స్టోర్‌లో 33మంది వినియోగదారులు దీనిపై సమీక్ష అందిచారు. అదానీ గ్రూప్ ప్రస్తుతం ఇండియాలోని ఏడు ప్రాంతాలు – ముంబై, అహ్మదాబాద్, లక్నో, జైపూర్, మంగళూరు, గౌహతి, తిరువనంతపురంలోని ఎయిర్‌పోర్టులను నిర్వహిస్తున్నది.
కొన్ని నెలల క్రితం లాజిస్టిక్స్ హబ్, డాటా సెంటర్ కోసం వాల్‌మార్ట్ యాజమాన్యంలోని ఫ్లిప్‌కార్ట్‌తో అదానీ గ్రూప్ వ్యూహాత్మక భాగస్వామ్యంలోకి ప్రవేశించింది. ఫ్లిప్‌కార్ట్ యాజమాన్యంలోని ట్రావెల్ యాప్ క్లియర్‌ట్రిప్‌లో మైనార్టీ వాటాను కూడా కైవసం చేసుకున్నది. కాగా, అదానీ గ్రూప్‌కు చెందిన అదానీ ట్రాన్స్మిషన్, అదానీ గ్రీన్, అదానీ గ్రీన్ ఎనర్జీ, అదానీ టోటల్ గ్యాస్ సంస్థలు ప్రపంచంలోని 500 అత్యంత విలువైన కంపెనీలలో ఒకటిగా నిలిచాయి.