టీవీ నటి శ్వేతా తివారీ వివాదంలో చిక్కుకుంది. తన ఇన్నర్ వేర్ గురించిన ప్రకటనలో.. దేవుడిని ప్రస్తావిస్తూ వ్యాఖ్యానించడం దీనికి కారణమైంది. కాగా మధ్యప్రదేశ్ హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా ఆమె వ్యాఖ్యలపై దర్యాప్తు చేసి 24గంటల్లోగా నివేదిక సమర్పించాలని పోలీసులను ఆదేశించారు. శ్వేతా తివారీ నిన్న భోపాల్‌లో తన వెబ్ సిరీస్ “షో స్టాపర్” ప్రమోషన్ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ వెబ్ సిరీస్‌లో రోహిత్ రాయ్, దిగంగనా సూర్యవంశీ , సౌరభ్ రాజ్ జైన్ కూడా ప్రధాన పాత్రలు పోషించారు.
మీడియా ప్రతినిధులతో ఇంటరాక్షన్ సందర్భంగా ఆమె ఈ వ్యాఖ్య చేసినప్పుడు ఆమె సహ నటులు కూడా అక్కడే ఉన్నారు. శ్వేతా తివారీ స్టేట్‌మెంట్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అందులో ఆమె తన లోదుస్తుల గురించి మాట్లాడుతూ దేవుడిని ప్రస్తావించిందని ఓ వార్తా సంస్థ తెలిపింది. ఈవెంట్ నుండి పొందిన క్లిప్ ప్రకారం.. స్టార్ తారాగణం వేదికపై కూర్చున్నట్లు కనిపించింది. శ్వేతా తివారీ “మేరే బ్రా కీ సైజ్ భగవాన్ లే రహే హై” అని ఒక ప్రకటన చేసింది. (దేవుడు నా బ్రాకి కొలతలు తీసుకుంటున్నాడు).
ప్రెస్ కాన్ఫరెన్స్ జరిగిన షో ఫ్యాషన్ సంబంధిత వెబ్ సిరీస్ అని తెలుస్తోంది. ప్రముఖ టీవీ సిరీస్ ‘మహాభారతం’ నుండి నటుడు, పౌరాణిక షోలో శ్రీకృష్ణుడి పాత్రను పోషించిన సౌరభ్ జైన్ రాబోయే సిరీస్‌లో ‘బ్రా ఫిట్టర్’ పాత్రను పోషించనున్నారు. విలేకరుల సమావేశంలో సౌరభ్‌ను ఉద్దేశించి శ్వేతా తివారీ సరదాగా ఈ మాటలు అన్నారని తెలుస్తోంది. కాగా, హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా గురువారం విలేకరులతో మాట్లాడుతూ, “నేను ఆ వ్యాఖ్యలు విన్నాను, నేను ఆ మాటలను తీవ్రంగా ఖండిస్తున్నా.” అన్నారు. దీనిపై విచారణ జరిపి 24 గంటల్లోగా నివేదిక ఇవ్వాలని భోపాల్ పోలీస్ కమిషనర్‌ను ఆదేశించానని, ఆ తర్వాత ఎలాంటి చర్యలు తీసుకుంటామో చూడాలని ఆయన చెప్పారు.