Friday, November 22, 2024

అక్టోబరు 10న మా ఎన్నికలు.. జీవితపై రఘుబాబు పోటీ

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలు ఆసక్తి రేపుతున్నాయి. ‘మా’ ఎన్నికల్లో ఈసారి ప్రకాశ్ రాజ్, మంచు విష్ణు వర్గాల మధ్య ప్రధానపోటీ నెలకొంది. ఇప్పటికే ప్రకాశ్ రాజ్ తన ప్యానెల్ ను ప్రకటించారు. ప్రకాశ్ రాజ్ ప్యానెల్లో ‘మా’ ప్రధాన కార్యదర్శిగా జీవిత పోటీపడుతుండడం తెలిసిందే. తాజాగామంచు విష్ణు ప్యానెల్లో ‘మా’ ప్రధాన కార్యదర్శిగా నటుడు రఘుబాబు పోటీ పడుతున్నారు. ప్రకాశ్ రాజ్ ప్యానెల్ నుంచి వైదొలగిన నటుడు, నిర్మాత బండ్ల గణేశ్ కూడా ప్రధాన కార్యదర్శి పదవి కోసం స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉన్నారు. ఈ నేపథ్యంలో మా ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి.

‘మా’ ఎన్నికలు అక్టోబరు 10న జరగనునున్నాయి. మా ఎన్నికల్లో అధ్యక్షుడి కోసం ప్రకాశ్‌రాజ్‌, మంచు విష్ణు, సీవీఎల్‌ నర్సింహరావు పోటీపడుతున్నారు. అక్టోబర్ 10న ఆదివారం ఉదయం 8గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకూ హైదరాబాద్‌ జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్‌లో పోలింగ్‌ నిర్వహించనున్నట్లు ఎన్నికల అధికారి కృష్ణమోహన్ తెలిపారు. ఎనిమిది మంది ఆఫీస్ బేరర్స్ 18 మంది ఎగ్జిక్యూటివ్ మెంబర్స్‌తో కూడిన కమిటీకి ఈ ఎన్నికలు జరగనున్నాయి.

సెప్టెంబరు 27-29 తేదీల మధ్య నామినేషన్లు స్వీకరించి 30న వాటిని పరిశీలిస్తామని కృష్ణమోహన్‌ వివరించారు. అక్టోబరు 2వ తేదీ సాయంత్రం 5గంటల్లోగా ఉపసంహరణకు అవకాశం ఉంటుందని, ఆ తర్వాత ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థుల తుది జాబితాను ప్రకటిస్తామని ఆయన వెల్లడించారు. ఒక అభ్యర్థి ఒకే పదవికి మాత్రమే పోటీ చేయాలని, గత కమిటీలో ఎగ్జిక్యూటివ్‌ మెంబర్‌ అయి ఉండి, 50 శాతం కన్నా తక్కువ ఈసీ మీటింగ్‌లకు హాజరు కాకపోయి ఉంటే పోటీ చేసేందుకు అర్హత ఉండదని తెలిపారు. 20 శాఖల అసోసియేషన్‌లలో ఆఫీస్‌ బేరర్స్‌గా ఉన్న వారు ఆ పదవులకు రాజీనామా చేయకపోతే ‘మా’ ఎన్నికల్లో పోటీ చేయడానికి అర్హులు కారని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement