ఏపీ ప్రభుత్వం సినిమా టిక్కెట్ల ధరల తగ్గింపు నిర్ణయం వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది. ఈ వ్యవహారంపై గత కొద్ది రోజులుగా రగడ కొనసాగుతోంది. సినిమా టిక్కెట్ల ధరలు తగ్గించటంపై టాలీవుడ్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. సినిమా టికెట్ల అంశంపై హీరో నాని చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. తన వ్యాఖ్యల అనంతరం చోటుచేసుకున్న పరిణామాలపై నాని మరోసారి స్పందించారు.
ఏపీలో సినిమా టికెట్ల ధరలపై తన అభిప్రాయాలు వెల్లడించానని, కానీ తన వ్యాఖ్యలను వివాదాస్పదం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తాను చేసిన వ్యాఖ్యలను ఒక్కొక్కొరు ఒక్కో విధంగా అర్థం చేసుకున్నారన్నారు. అదే సమయంలో తన వ్యాఖ్యల పైన ట్రోలింగ్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వకీల్‌సాబ్ సినిమా విడుదల సమయంలోనూ థియేటర్ల సమస్య వచ్చిందన్న నాని.. అప్పుడే ఇండస్ట్రీ అంతా కలిసి పోరాడితే బాగుండేదని అభిప్రాయపడ్డారు. టాలీవుడ్ లో ఐక్యత లేదంటూ నాని సంచలన వ్యాఖ్య చేశారు. అందరూ ఒకే తాటిపై ఉంటే ఈ సమస్య ఎప్పుడో పరిష్కారం అయ్యేదని అభిప్రాయపడ్డారు. నాని చేసిన తాజా వ్యాఖ్యలు టాలీవుడ్ లో మరోసారి చర్చనీయాంశంగా మారాయి.
కాగా, ఇటీవల జరిగిన శ్యామ్ సింగరాయ్ సినిమా ప్రమోషన్ లో నాని సినిమా టిక్కెట్ల అంశంపై మాట్లాడారు. సినిమా టిక్కెట్ల ధరలు తగ్గించటం అంటే…ప్రేక్షకులను అవమానించటమే అని వ్యాఖ్యానించారు. థియేటర్లలో వచ్చే వసూళ్ల కంటే, కిరాణకొట్టులో వచ్చే రోజువారి కలెక్షన్స్ ఎక్కువని అన్నారు. నాని వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేపింది. దీనికి మంత్రులు అనిల్ కుమార్ యాదవ్, బొత్స సీరియస్ గా స్పందించారు. నానికి కౌంటర్ ఇచ్చారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..