Monday, November 18, 2024

Omicron in India: అవసరమైతే నైట్‌ కర్ఫ్యూలు.. ఒమిక్రాన్ పై రాష్ట్రాలకు కేంద్రం లేఖ..

దేశంలో ఒమిక్రాన్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఇప్పటికే దాదాపు 12 రాష్ట్రాల్లో ఒమిక్రాన్ కేసులు బయటపడ్డాయి. దేశవ్యాప్తంగా దాదాపు 200 పైగా కేసులు నమోదు అయింది. డెల్టా వేరియంట్ కంటే మూడు రెట్లు వేగంగా ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి చెందుతోంది. ఈ నేపథ్యంలో కేంద్రం అప్రమత్తమైంది. రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు పలు కీలక సూచనలు చేస్తూ లేఖలు రాసింది.

ఒమిక్రాన్‌ నియంత్రణకు వార్‌రూమ్‌లను ఏర్పాటు చేయాలని రాష్ట్రాలను కోరింది. కంటెన్మెంట్‌ జోన్లపై దృష్టి పెట్టాలని సూచించింది. ఒమిక్రాన్‌ వ్యాప్తికి అడ్డుకునేందుకు ప్రాంతాలు, జిల్లాల వారీగా ఎక్కడికక్కడ కఠిన చర్యలు చేపట్టాలని ఆదేశించింది. అవసరమైతే నైట్‌ కర్ఫ్యూలు, ఆంక్షలు విధించడం, భారీ జనసమూహాలను నియంత్రించడం, కార్యాలయాల్లో సిబ్బంది సంఖ్యను తగ్గించడం, ప్రజా రవాణాపై ఆంక్షలు వంటి చర్యలు చేపట్టాలని లేఖలో పేర్కొంది. అలాగే, ఆస్పత్రుల్లో పడకలు, అంబులెన్సులు, ఆక్సిజన్‌ పరికరాలు, ఔషధాలు వంటి వైద్య సంబంధమైన సౌకర్యాల మెరుగుదలకు అత్యవసర నిధులు వినియోగించుకోవాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది.

స్థానిక పరిస్థితులను బట్టి ఎప్పటికప్పుడు రక్షణ చర్యలు తీసుకోవాలని పేర్కొంది. గత వారం రోజుల్లో 10 శాతానికి మించి పాజిటివ్ కేసులు వచ్చినా, ఆక్సిజన్ సపోర్ట్ ఉన్న ఐసీయూ బెడ్స్ 40 శాతం ఆక్యుపెన్సీ ఉన్నా పరిస్థితిని తీవ్రంగా పరిగణించాలని స్పష్టం చేసింది. కంటైన్మెంట్ జోన్లను ఏర్పాటు చేయాలని, అవసరమైతే రాత్రి పూట కర్ఫ్యూలను విధించాలని తెలిపింది.

మన దేశంలోని పలు ప్రాంతాల్లో ఒమిక్రాన్ తో పాటు డెల్టా వేరియంట్ కూడా ఇప్పటికీ ఉందని పేర్కొంది. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా కంటైన్మెంట్ ప్రక్రియను ముమ్మరం చేయాలన్న కేంద్రం.. పరిస్థితి విషమించక ముందే కట్టుదిట్టమైన అన్ని చర్యలను తీసుకోవాలని సూచించింది. 100 శాతం వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తయ్యేలా అన్ని చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలకు లేఖలో కేంద్రం తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement