న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: భారతదేశానికి వ్యతిరేకంగా దేశభద్రతకు విఘాతం కలిగించేలా సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్న సోషల్ మీడియా ఆధారిత ఛానెళ్లపై కేంద్ర సమాచార, ప్రసారాల శాఖ కొరఢా ఝులిపించింది. ఐటీ రూల్స్ 2021 ప్రకారం అత్యవసర అధికారాలను వినియోగించుకుని 8 యూట్యూబ్ న్యూస్ ఛానళ్లు, ఒక ఫేస్బుక్ ఖాతా, రెండు ఫేస్బుక్ పోస్టులను బ్లాక్ చేయాలని కేంద్ర సమాచార, ప్రసారాల శాఖ ఈనెల 16న ఉత్తర్వులు జారీ చేసింది. బ్లాక్ చేసిన యూట్యూబ్ ఛానెళ్లలో 7 భారతదేశానికి చెందినవి కాగా 1 పాకిస్తాన్ నుంచి నిర్వహిస్తున్నట్టు తెలిసింది. వీటికి 114 కోట్లకు పైగా వ్యూయర్‌షిప్, 85 లక్షల మందికి పైగా యూజర్లు నమోదు చేసుకున్నట్టు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొంది.
భారతదేశంలో మత సామరస్యాన్ని రెచ్చగొట్టడమే లక్ష్యంగా ఈ యూట్యూబ్ ఛానెళ్లలో పోస్టు చేసిన కథనాలు ఉన్నాయని వివరించింది. భారత సాయుధ దళాలు, జమ్ముకశ్మీర్ వంటి వివిధ అంశాలపై తప్పుడు వార్తలను పోస్ట్ చేయడానికి ఈ యూట్యూబ్ ఛానళ్లను ఉపయోగించారు. జాతీయ భద్రత, ఇతర దేశాలతో భారతదేశ స్నేహపూర్వక సంబంధాల దృష్ట్యా ఇవి తప్పుదారి పట్టించేలా ఉన్నాయని ప్రభుత్వం గుర్తించింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం, 2000లోని సెక్షన్ 69A పరిధిలో ఇవన్నీ నేరపూరితమైన చర్యలని ప్రభుత్వం తెలిపింది.
డిసెంబర్ 2021 నుంచి ఇప్పటి వరకు మొత్తం 102 యూట్యూబ్ ఆధారిత వార్తా ఛానెళ్లు, అనేక ఇతర సోషల్ మీడియా ఖాతాలను బ్లాక్ మంత్రిత్వ శాఖ బ్లాక్ చేసింది. తాజాగా బ్లాక్ చేయాలంటూ ఆదేశాలిచ్చిన ఛానెళ్లు, పేజీల వివరాలు..
బ్లాక్ చేసిన సోషల్ మీడియా ఖాతాలు, URLల వివరాలు
- లోక్‌తంత్ర టీవీ
- U&V టీవీ
- AM రజ్వీ
- గౌరవ శాలి పవన్ మిథిలాంచల్
- సీ టాప్ 5TH
- సర్కారీ అప్‌డేట్
- సబ్ కుచ్ దేఖో
- న్యూస్ కి దునియా ( పాకిస్తాన్ ఆధారితం )
Facebook పేజి - లోక్ తంత్ర టీవీ