సీనియర్ నటి మీనా కుటుంబాన్ని కరోనా తీవ్ర విషాదంలోకి నెట్టేసింది. కరోనా తర్వాత వచ్చే ఆరోగ్య సమస్యలతో హీరోయిన్ మీనా భర్త విద్యాసాగర్(48) మృతి చెందారు. గత కొంతకాలంగా చెన్నైలోని ఎంజిఎం ఆసుపత్రులో విద్యా సాగర్ చికిత్స పొందుతున్నారు. కానీ ఆయన ఆరోగ్యం విషమించడంతో విద్యాసాగర్ మృతి చెందారు. ఇప్పుడు ఈ వార్త చిత్ర పరిశ్రమ మొత్తాన్ని తీవ్ర విషాదంలోకి నెట్టివేసింది. మీనా, విద్యాసాగర్ 2009లో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. వీరికి నైనిక అనే కుమార్తె కూడా ఉంది. నైనిక.. చైల్డ్ ఆర్టిస్ట్ గా దళపతి విజయ్ ‘తేరి’ చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. అయితే విద్యాసాగర్ మృతికి షాకింగ్ రీజన్స్ వినిపిస్తున్నాయి. ఈ ఏడాది జనవరిలో మీనా ఫ్యామిలీ మొత్తం కరోనా బారీన పడ్డారు. 2022లో మా ఇంటికి వచ్చిన తొలి అతిథి కరోనా అంటూ జనవరిలో మీనా సోషల్ మీడియా పోస్ట్ కూడా చేసింది. కోవిడ్ నుంచి మీనా, నైనిక కోలుకున్నారు. కానీ విద్యా సాగర్ కి పోస్ట్ కోవిడ్ సమస్యలు తలెత్తాయి. ముఖ్యంగా ఆయన శ్వాస వ్యవస్థ దెబ్బ తినింది. ఊపిరి తిత్తులకు ఇన్ఫెక్షన్ సోకడం ఓ కారణంగా చెబుతున్నారు.
దీనికి తోడు ఆయన పావురాల విసర్జన నుంచి వచ్చే కలుషితమైన గాలి వల్ల కూడా ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ ఎక్కువైనట్లు తెలుస్తోంది. ఊపిరితిత్తులు ఎక్కువ భాగం చెడిపోవడంతో వైద్యులు ట్రాన్స్ ప్లాంటేషన్ సూచించారట. కానీ అది అంత సులువు కాదు. వేరొకరి ఊపిరి తిత్తులు లభించాలి. అలాగే అవి సెట్ అవుతాయని వైద్యులు కూడా 100 శాతం చెప్పడం కష్టం. దీనితో విద్యాసాగర్ గత కొన్ని నెలలుగా చికిత్సనే కొనసాగిస్తున్నారు. మీనా భర్త మృతి చెందడంతో సెలెబ్రిటీలు దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. నటి ఖుష్బూ స్పందిస్తూ.. దారుణమైన వార్తతో నిద్రలేచాను. మీనా భర్త మృతి చెందారని తెలియడంతో షాక్ లో ఉన్నా. జీవితం చాలా దారుణమైనది. ఇప్పుడు నా మనసు మీనా, ఆమె ఫ్యామిలీ గురించి ఆలోచిస్తోంది. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి అని సోషల్ మీడియాలో అన్నారు. విద్యాసాగర్ అకాల మరణం తీవ్రంగా కలచివేసింది. వారి కుటుంబ సభ్యులకు నా సానుభూతి. మీనా, విద్యాసాగర్ ఇద్దరూ నా ఫ్యామిలీకి చాలా క్లోజ్ అంటూ నటుడు శరత్ కుమార్ ట్వీట్ చేశారు. విద్యాసాగర్ అంత్యక్రియలు ఈ మధ్యాహ్నం 2 గంటలకు చెన్నైలోనే జరుగనున్నాయి.