రోడ్లపై అదే పనిగా హారన్ కొట్టే వారికి చెక్ పెట్టబోతున్నారు ట్రాఫిక్ పోలీసులు. శబ్ధ కాలుష్యాన్ని నియంత్రించడానికి రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో అకౌస్టిక్ కెమెరాలను త్వరలో ఏర్పాటు చేయబోతున్నారు. అనవసరంగా హారన్ కొడితే ఈ అకౌస్టిక్ కెమెరాలు పట్టేస్తాయి. ఈ కెమెరాలకు మైక్రోఫోన్, హెచ్‌డీ కెమెరా, డిస్‌ప్లే స్ర్కీన్, ఫ్లాష్‌లు ఉంటాయి. హారన్ శబ్ధాన్నాబట్టి ఏ వైపు నుండి వెహికిల్ సౌండ్ వచ్చిందో అటు తిరిగి టక్కున ఫొటో, వీడియో తీస్తాయి. మరో మూడు వారాల్లో సిటీలోని రోడ్లపై ఇవి పనిచేయడం ప్రారంభించనున్నట్టు తెలుస్తోంది.
హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ సీపీ ఏవీ రంగనాథ్ నాంపల్లి ట్రాఫిక్ కాంప్లెక్స్ వద్ద కెమెరా ట్రయల్ రన్ నిర్వహించారు. వీటిని ఏర్పాటుచేశాక.. హారన్ నిబంధనలు ఉల్లంఘించే వారికి రూ.1000 ఫైన్‌తో పాటు, ఎక్కువ చలాన్లు పడితే వాహనాలపై కేసులు, చార్జిషీట్లు ఉంటాయని కూడా తెలిపారు. దేశంలోనే మొదటిసారిగా హైదరాబాద్‌లో ఈ అకౌస్టిక్ కెమెరాలను ఏర్పాటు చేయనున్నట్టు ఆయన వెల్లడించారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ను హారన్ మోతలు లేని సిటీగా మార్చే ప్రయత్నాల్లో భాగంగానే ఈ చర్యలు తీసుకుంటున్నామని చెప్పుకొచ్చారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..