Wednesday, November 20, 2024

నిందితుడి దుస్సాహసం.. తప్పించుకునేందుకు మూడో అంత‌స్తు నుంచి దూకేశాడు..

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: మహేశ్ కో-ఆపరేటివ్ బ్యాంక్ హ్యాకింగ్ కేసు రాష్ట్రంలో సంచలనం సృష్టింగా, ఆ కేసు దర్యాప్తులోనూ సంచలనాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా ఈ కేసులో మరో నిందితుణ్ణి ఢిల్లీలో పట్టుకుని హైదరాబాద్ తరలించేందుకు సిద్ధమవుతుండగా.. తప్పించుకునే ప్రయత్నం చేసిన ఆ నిందితుడు తన ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు. కేసు దర్యాప్తు చేస్తున్న తెలంగాణ పోలీసులు, ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి భవన్లో రూమ్ నెంబర్ 401లో నిందితుణ్ణి ఉంచారు. టాయ్‌లెట్‌కి వెళ్లాలని చెప్పడంతో పోలీసులు అత‌ని చేతికున్న బేడీల (హ్యాండ్ క‌ప్స్‌) ను తొలగించారు. ఇదే అదనుగా బాల్కనీ నుంచి తప్పించుకునేందుకు నిందితుడు ప్రయత్నించాడు.

గోదావరి బ్లాక్ భవనం నుంచి పక్కనే ఉన్న అడ్మినిస్ట్రేటివ్ భవనం వరకు వెళ్తున్న రెండు ఇనుప పైపులను పట్టుకుని తప్పించుకోవాలని అనుకున్నాడు. అయితే పైపులు పెద్దగా ఉండడంతో చేతికి పట్టు దొరకలేదు. అప్పటికే తేరుకున్న పోలీసులు కింద ఉన్న ఏపీఎస్పీ బెటాలియన్ సిబ్బందిని అప్రమత్తం చేశారు. అందరూ కలిసి నిందితుణ్ణి సురక్షితంగా కిందకు దించేందుకు ప్రయత్నాలు మొదలుపెడుతుండగానే, పట్టుజారి కిందపడిపోయాడు. అదృష్టావశాత్తూ 3వ అంతస్తు నుంచి కిందపడ్డప్పటికీ, చెట్టు కొమ్మ మీదుగా పడడంతో నేరుగా నేలను తగలకుండా రక్షణ పొందగలిగాడు. దాంతో 3వ అంతస్తు నుంచి కిందపడ్డా.. ప్రాణాలు కాపాడుకోగలిగాడు.

మొరాయించిన అంబులెన్స్
కిందపడి కదల్లేని స్థితిలో ఉన్న నిందితుణ్ణి పోలీసులు అంబులెన్సులో ఆస్పత్రికి తరలించేందుకు మొదట ప్రయత్నించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన అంబులెన్స్ ఒకటి భవన్‌లో ముఖ్యమంత్రి కాన్వాయ్‌లో భాగంగా సిద్ధంగా ఉంటుంది. అయితే ఆ సమయంలో అంబులెన్స్ మొరాయించడంతో పోలీసులు దాన్ని నెట్టుకుంటూ వెళ్లి ఇంజిన్ స్టార్ట్ చేసే ప్రయత్నం చేశారు. అయినా సరే ఇంజిన్ స్టార్ట్ కాకపోవడంతో, ఆటోలో నిందితుణ్ణి ఆస్పత్రికి తరలించారు. ప్రాణాపాయం లేదని వైద్యులు చెప్పినట్టు తెలిసింది. కేసు విచారణ దశలో ఉన్నందున నిందితుడి వివరాలను వెల్లడించేందుకు పోలీసులు నిరాకరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement