ఆలయ ఉత్సవంలో అపశృతి చోటుచేసుకోవడంతో నలుగురు మృతిచెందగా, మరో తొమ్మిది మంది గాయపడిన ఘటన తమిళనాడు రాష్ట్రంలో చోటుచేసుకుంది. తమిళనాడులోని అరక్కోణం ఆలయంలో అపశృతి జరిగింది. ఆలయ ఉత్సవాల సందర్భంగా క్రేన్ కూలిపోవడంతో నలుగురు మృతిచెందగా, మరో 9మందికి గాయాలయ్యాయి. అరక్కోణం సమీపంలోని కిల్వీడి గ్రామంలో ద్రౌపతి దేవి ఉత్సవాల్లో భాగంగా ఊరేగింపు చేపట్టారు.
గ్రామంలోని వీధుల్లో దేవతా విగ్రహాన్ని తీసుకెళ్లేందుకు క్రేన్‌ను వినియోగించారు. దేవతా విగ్రహాన్ని అలంకరించేందుకు భక్తుల నుంచి మాలలు స్వీకరించడానికి కొందరు వ్యక్తులు కొంత ఎత్తులో క్రేన్‌పై ఉన్నారు. ఊరేగింపు సమయంలో ఆలయం సమీపంలో క్రేన్ కూలిపోయింది. దీంతో నలుగురు చనిపోగా, 9మంది గాయపడ్డారు. మృతుల్లో ముగ్గురిని ముత్తుకుమార్, ఎస్. భూపాలన్, జోతిబాబులుగా గుర్తించారు. వీరు ముగ్గురు కూడా అదే గ్రామానికి చెందినవారని తెలుస్తోంది. ఈ ఘటనతో ఉత్సవంలో పాల్గొనేందుకు వచ్చిన భక్తులు భయంతో పరుగులు తీశారు.