యాదగిరిగుట్ట సబ్ రిజిస్ట్రార్ దేవానంద్ అక్రమార్జన చిట్టా బయటపడుతోంది. డాక్యుమెంట్ రైటర్ ద్వారా రూ.20 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ యాదగరిగుట్ట సబ్ రిజిస్ర్టార్ దేవానంద్ నివాసంలో రూ.76 లక్షల నగదు లభ్యమైంది. దీనిని ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం కొలనుపాక గ్రామపంచాయతీ లేఅవుట్‌లోని ప్లాట్లను రిజిస్ర్టేషన్ చేసేందుకు లంచం తీసుకుంటూ సబ్ రిజిస్ర్టార్ గురువారం(జులై 29) ఏసీబీకి పట్టుబడ్డ విషయం తెలిసిందే. ఏసీబీ అధికారులు ఏకకాలంలో సబ్ రిజిస్ర్టార్ కార్యాలయంతోపాటు మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మేడిపల్లి మండలంలోని ఆయన నివాసంలో గురువారం అర్ధరాత్రి పొద్దుపోయే వరకు సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో రూ.76,09,500 నగదు, తొమ్మిది మద్యం సీసాలు, 27.06 గ్రాముల బంగారు ఆభరణాలతోపాటు 7.09 ఎకరాల భూమి, 200 గజాల ఇంటి స్థలం డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు.
యాదాద్రి భువనగిరి జిల్లా హైదరాబాద్ నగరానికి సమీపంలో ఉండటంతోపాటు యాదాద్రిలో లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దుతుండటంతో శివారు ప్రాంతంలో కొత్త లేఅవుట్లు, వెంచర్లు పుట్టుకొస్తున్నాయి. ఈ ప్రాంతంలో లేఅవుట్లు, నిర్మాణాలు చేపట్టాలంటే హెచ్‌ఎండీఏ అనుమతి పొందాల్సి ఉంటుంది. కానీ, నగరర శివారు గ్రామాల్లోని వ్యవసాయ భూములను ల్యాండ్ కన్వర్షన్ చేయకుండా, హెచ్‌ఎండీఏ అనుమతులు తీసుకోకుండానే లేఅవుట్లు చేసి.. ప్లాట్లను విక్రయిస్తున్నారు. రిజిస్ర్టేషన్ శాఖ అధికారులు డబ్బులకు ఆశపడి వీటిని రిజిస్ర్టేషన్ చేస్తున్నారు. సబ్ రిజిస్ట్రార్ దేవానంద్ ఇలాగే చేస్తూ పట్టుబడ్డారు. గతంలోనూ యాదగిరిగుట్ట సబ్ రిజిస్ర్టార్ కార్యాలయంలో ఈసీలు, రిజిస్ర్టేషన్లకు డబ్బులు వసూలు చేస్తున్నారని ఓ ఉద్యోగిపై చర్యలు తీసుకున్నారు. రెండేళ్ల క్రితం కూడా ఏసీబీ దాడులు జరిగాయి. ఆయినా నిబంధనలకు విరుద్ధంగా రిజిస్ర్టేషన్లు జరుగుతూనే ఉన్నాయి.
ఇది కూడా చదవండిః ఈటలది డ్రామానా? కౌశిక్ ఓవర్ యాక్షనా?!