హుజురాబాద్ ఉప ఎన్నికల వేళ మాజీ మంత్రి ఈటల రాజేందర్ ని ఏసీబీ టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. ఈటల ఆర్థిక మూలాలను కేసీఆర్ టార్గెట్ చేశారని సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికే ఈటల భార్య పేరుతో ఉన్న జమునా హ్యాచరీస్ భూములపై దర్యాప్తు జరుపుతుండగా… దేవరయంజాల్ భూములను అక్రమంగా ఆక్రమించారని ఏకంగా ఐఏఎస్ కమిటీ దర్యాప్తు చేపట్టింది. తాజాగా నాంపల్లి ఎగ్జిబిషన్ కమిటీలో అవకతవకలు జరిగాయని ఏసీబీ రంగంలోకి దిగింది.
ఈటల రాజేందర్ అధ్యక్షుడిగా వ్యవహరించిన హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ సొసైటీ కార్యాలయంలో శుక్రవారం ఏసీబీ సోదాలు నిర్వహించింది. సొసైటీ లావాదేవీల వ్యవహారంలో అధికారులు ఆరా తీశారు. పలు డాక్యుమెంట్లను సీజ్ చేశారు. ఆరేళ్లుగా ఎగ్జిబిషన్ సొసైటీ అధ్యక్షుడిగా ఈటల రాజేందర్ ఉన్నారు. నాంపల్లి ఎగ్జిబిషన్ సొసైటీకి ఇటీవల అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో ఏసీబీ అధికారులు తనిఖీ చేయడంపై ఉత్కంఠ నెలకొంది. హుజురాబాద్ ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతో ఈటల రాజేందర్‌పై ప్రభుత్వం ఏసీబీ రూపంలో కక్ష సాధిస్తోందని ఆయన వర్గం ఆరోపిస్తోంది. హుజురాబాద్ ఎన్నికల కోసమే.. ప్రభుత్వం ఈటలను ఇబ్బంది పెట్టేందుకే ఏసీబీని రంగంలోకి దించినట్లు ఈటల వర్గీయులు అంటున్నారు.
ఇది కూడా చదవండి: కడియంపై కేసీఆర్ లెక్క ఇదేనా?