Sunday, November 24, 2024

ABG Shipyard : పై ఈడీ దాడులు -మ‌నీ లాండ‌రింగ్ లో క్రిమిన‌ల్ కేసు

ఏబీజీ షిప్ యార్డ్ లిమిటెడ్, దాని మాజీ ప్ర‌మోట‌ర్ల‌తో పాటు ఇత‌రుల‌పై మ‌నీ లాండ‌రింగ్ క్రిమిన‌ల్ కేసు న‌మోద‌య్యాయి. 28బ్యాంకుల నుంచి రూ.22,842కోట్ల‌కు పైగా మోసం చేసిన ఆరోప‌ణ‌ల‌పై ఈడీ దాడి చేసింది. దేశంలోనే అతిపెద్ద బ్యాంకు లోన్ ఫ్రాడ్ కేసులో సీబీఐ ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన కొద్ది రోజుల తర్వాత ఈ ప‌రిణామం చోటు చేసుకుంది. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఫిర్యాదు, ఫోరెన్సిక్ ఆడిట్ నివేదికను అధ్యయనం చేసిన తర్వాత మనీలాండరింగ్ నిరోధక చట్టంలోని సెక్షన్ల కింద ఈడీ కేసు నమోదు చేసింది. బ్యాంకు రుణాల నిధులను మళ్లించడం, ప్రజల సొమ్మును లాండరింగ్ చేయడానికి షెల్ కంపెనీలను సృష్టించడం, కంపెనీ ఇతర అధికారుల పాత్ర వంటి ఆరోపణలను ఈడీ ప్రత్యేకంగా పరిశీలిస్తుందని అధికారిక వ‌ర్గాలు తెలిపాయి. రుణాలను మళ్లించడం ద్వారా కంపెనీ విదేశీ అనుబంధ సంస్థలో భారీ పెట్టుబడులు పెట్టిన విధానంపై కూడా ఈడీ ప్రముఖంగా విచార‌ణ జ‌ర‌ప‌నుంది. ఇందులో నిందితుల ఆస్తులను అటాచ్ చేసే అవ‌కాశం కూడా ఉంది.

బ్యాంకుల కన్సార్టియంను రూ.22,842 కోట్లకు పైగా మోసం చేశారన్న ఆరోపణలపై ఏబీజీ షిప్‌యార్డ్ లిమిటెడ్‌తో పాటు అప్పటి చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ రిషి కమలేష్ అగర్వాల్‌తో పాటు ఇతరులపై ఇటీవ‌ల సీబీఐ కేసు నమోదు చేసింది.అప్పటి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సంతానం ముత్తస్వామి, డైరెక్టర్లు అశ్వినీ కుమార్, సుశీల్ కుమార్ అగర్వాల్, రవి విమల్ నెవెటియా, మరో కంపెనీ ABG ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్‌పై పీనల్ కోడ్, అవినీతి నిరోధక చట్టం ప్ర‌కారం నేరపూరిత కుట్ర, మోసం, నేరపూరిత విశ్వాస ఉల్లంఘన‌, భారత అధికారిక పదవిని దుర్వినియోగం చేయడం వంటి కేసులు న‌మోదు చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement