ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కమ్యూనికేషన్స్ ఇన్‌చార్జి విజయ్ నాయర్, హైదరాబాద్‌కు చెందిన వ్యాపారవేత్త అభిషేక్ బోయిన్‌పల్లికి ఢిల్లీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) రిమాండ్‌కు అనుమతి ఇవ్వడంతో వీరిద్దరినీ ఇప్పట్లో విడుదల చేయడం లేదు. ఢిల్లీ లిక్కర్ పాలసీ కుంభకోణంలో విజయ్ నాయర్, అభిషేక్ బోయిన్‌పల్లిని సీబీఐ అరెస్ట్ చేసింది. తీహార్ జైలులో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న వీరిద్దరూ ఢిల్లీ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఇవ్వాల (సోమవారం) బెయిల్ విచారణకు ముందు ఈడీ వారిని కస్టడీలోకి తీసుకుంది.
ఢిల్లీలోని రూస్ అవెన్యూ కోర్టు విజయ్ నాయర్, అభిషేక్ బోయిన్‌పల్లికి వ్యక్తిగత పూచీకత్తుతో పాటు రూ.2 లక్షల పూచీకత్తుతో ఇవ్వాల బెయిల్ మంజూరు చేసింది. అయితే, ఈ కేసులో తదుపరి విచారణ కోసం ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ 5 రోజుల కస్టడీని మంజూరు చేసినందున వారిద్దరూ జైలు నుండి విడుదల కావడం లేదు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ అంటే ఏమిటి?
ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ 2021-22 జరిగిన అవకతవకలపై సీబీఐ విచారణకు ఎల్-జీ వినయ్ కుమార్ సక్సేనా సిఫార్సు చేసిన తర్వాత మద్యం పథకంలో అవకతవకలు జరిగాయనే ఆరోపణలున్నాయి. గతేడాది నవంబర్ 17 నుంచి అమలు చేసిన ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ అమలుపై సీబీఐ విచారణ అనంతరం ఈ ఏడాది జులైలో అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ప్రభుత్వం దీన్ని రద్దు చేసింది. ఆరోపించిన కుంభకోణంలో మనీ ట్రాన్సాక్షన్స్‌పై ED దర్యాప్తు చేస్తోంది.