Tuesday, November 26, 2024

నాసా వర్సెస్ చైనా.. చంద్రుడిపై కూలే రాకెట్‌ శకలంపై చైనా క్లారిటీ

వచ్చే నెలలో ఒక రాకెట్‌కు చెందిన శకలం చంద్రుడిపై కూలనుంది. ఈ విషయాన్ని ఒక స్వతంత్ర శాస్త్రవేత్త కొన్నిరోజుల క్రితం గుర్తించాడు. అది ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్‌కు చెందిన స్పేస్‌ఎక్స్‌ కంపెనీదని, ఫాల్కన్ రాకెట్‌ స్టేజ్ అని అతను అభిప్రాయపడ్డాడు. అయితే దీనిపై పరిశోధన చేస్తామని అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ (నాసా) అప్పుడు చెప్పింది. ఆ తర్వాత తమ పరిశోధనల సారాంశాన్ని బయటపెట్టింది.

ఆ రాకెట్ శకలం ఫాల్కన్‌కు చెందింది కాదని, 2014లో చైనా ప్రయోగించిన చాంగె 5-టీ1 రాకెట్‌లోని బూస్టర్ రాకెట్ భాగమని పేర్కొంది. ఈ వ్యాఖ్యలను చైనా కొట్టిపారేసింది. 2014లో చైనా లాక్ మార్చ్ 3సీ మిషన్‌లో భాగంగా చాంగె 5-టీ1 ప్రయోగించింది. సిబ్బంది లేని ఈ మిషన్ ప్రధాన లక్ష్యం.. అంతరిక్షం నుంచి తిరిగి భూవాతావరణంలోకి రాకెట్ క్యాప్సూల్ ప్రవేశించగలదా? లేదా? అని పరీక్షించడం. దీనికి సంబంధించిన బూస్టర్ రాకెట్ శకలమే మార్చి 4న చంద్రుడిపై కూలనుందని నాసా అంటోంది.

అయితే తమ రాకెట్‌ శిథిలాలు భూ వాతావరణంలోకి ప్రవేశించే సమయంలో మండిపోయాయని, చంద్రుడిపై కూలబోయే రాకెట్ భాగానికి తమ దేశానికి ఎటువంటి సంబంధమూ లేదని చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి వాంగ్ వెన్‌బిన్ స్పష్టంచేశారు. ఈ గొడవతో అంతరిక్ష వ్యర్థాలు, వాటిపై నిఘా ఉంచే బాధ్యత ఎవరిదనే వివాదం మరోసారి తెరపైకి వచ్చింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement